సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచన మేరకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపాలనే నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థను పరిరక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో సీవీసీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జైట్లీ చెప్పుకొచ్చారు.
సీబీఐ విశ్వసనీయత, నిష్పాక్షిక విచారణను కొనసాగించే క్రమంలో దర్యాప్తు సంస్థ విస్తృత ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వ్యవహరించిందన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి అలోక్ వర్మను నియమించాలని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసిన క్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం నాగేశ్వరరావును నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
కాగా అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య విభేదాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం వీరిని సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment