సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేసే విషయంలో అక్టోబర్ 31 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సోమవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మార్ తదితర కేసుల్లో ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు సి.కుటుంబరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఐఏఎస్‌ల ప్రాసిక్యూషన్ వ్యవహారాన్ని సీవీసీకి నివేదించామని, సీవీసీ నుంచి సమాచారం వచ్చాక తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, అక్టోబర్ 31 నాటికి ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియచేయాలని సీవీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఐఏఎస్‌లపై అక్టోబర్ 31 కల్లా ఏదో ఒక నిర్ణయం
Published Tue, Sep 24 2013 3:46 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement