emaar properties
-
‘ఎమ్మార్ ప్రాపర్టీస్’పై న్యాయ నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీ వివాదాలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశంలో 2015లో అప్పటి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీకి తోడు అదనంగా ఈ న్యాయ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీ వ్యవహారం వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జిషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ కేసుల మూలంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మార్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్యపూర్వక పరిష్కారానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక న్యాయ సంస్థ (లీగల్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీనికి సీఎం సమ్మతిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ లీగల్ ఏజెన్సీతోనూ సంప్రదింపులు జరిపి తగు సూచనలు ఇస్తుందన్నారు. ఎమ్మార్‌పై దర్యాప్తులు, విచారణలు: 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015 అక్టోబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఐదుగురు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. -
ఎమ్మార్ కేసులో ఈడీ విచారణ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హోం డైరెక్టర్ తుమ్మల రంగారావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు విచారణను 3 రోజులు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీబీఐ కేసును తొలగించినా సీబీఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. తనను నిందితునిగా చేర్చడా న్ని సవాల్ చేస్తూ రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీల త శుక్రవారం విచారించారు. ఆయన అప్రూవర్‌గా మారి సీఆర్పీసీ 164 కింద వాంగ్మూ లం ఇచ్చారు. దీంతో ఆయన్ను సీబీఐ కేసులో నిందితుల జాబితా నుంచి తొలగించారు. -
ప్రభుత్వ నిర్వహణలో ‘ఎమ్మార్’ గోల్ఫ్ కోర్స్!
దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి. హైదరాబాద్: హైదరాబాద్‌లోని మణికొండలో ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించిన గోల్ఫ్ కోర్స్‌ను స్వయంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గోల్ఫ్‌కోర్స్‌తోపాటు విల్లాలు, విలాసవంతమైన అపార్టుమెంట్ల నిర్మాణానికి 1998లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 535 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్ కోర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే న్యాయ వివాదాల కారణంగా దాని నిర్వహణ ఆగిపోయింది. గోల్ఫ్ కోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కొందరు విల్లాల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గోల్ఫ్ కోర్స్ నిర్వహణను చేపట్టే విషయాన్ని పరిశీలించాలని, అందులో ఖాళీగా ఉన్న భూమిని ఏ అవసరాలకు వినియోగించాలన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గోల్ఫ్ కోర్స్, విల్లాలు, క్లబ్, అపార్టుమెంట్ల నిర్మాణం తరువాత దాదాపు 50 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. జింకల పార్కుకు ప్రహారీ నిర్మాణం నగరంలోని ఎల్.బి. నగర్ పరిధిలో ఉన్న హరిణి వనస్థలి జింకల పార్కును సంరక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పార్కు స్థలం కబ్జా కాకుండా చుట్టూ ప్రహారీగోడను నిర్మించాలని సూచించారు. పార్కు అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంగీకరించారు. కేబీఆర్ పార్కు మాదిరి బొటానికల్ గార్డెన్ హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌ను బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్) మాదిరి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాకింగ్ కోసం వాక్‌వే నిర్మించాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదం కేసులో గత 20 నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సునీల్‌రెడ్డి సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం సునీల్‌రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌రెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఆయన అభిమానులు, బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఐఏఎస్‌లపై అక్టోబర్ 31 కల్లా ఏదో ఒక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేసే విషయంలో అక్టోబర్ 31 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సోమవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్ తదితర కేసుల్లో ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు సి.కుటుంబరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఐఏఎస్‌ల ప్రాసిక్యూషన్ వ్యవహారాన్ని సీవీసీకి నివేదించామని, సీవీసీ నుంచి సమాచారం వచ్చాక తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, అక్టోబర్ 31 నాటికి ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియచేయాలని సీవీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.