
వివాదాల పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సచివాలయంలో ముఖ్యమంత్రితో ఎమ్మార్ ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీ వివాదాలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశంలో 2015లో అప్పటి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీకి తోడు అదనంగా ఈ న్యాయ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీ వ్యవహారం వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జిషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ కేసుల మూలంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మార్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్యపూర్వక పరిష్కారానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక న్యాయ సంస్థ (లీగల్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీనికి సీఎం సమ్మతిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ లీగల్ ఏజెన్సీతోనూ సంప్రదింపులు జరిపి తగు సూచనలు ఇస్తుందన్నారు.
ఎమ్మార్‌పై దర్యాప్తులు, విచారణలు: 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015 అక్టోబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఐదుగురు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment