ప్రభుత్వ నిర్వహణలో ‘ఎమ్మార్’ గోల్ఫ్ కోర్స్!
- దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి. హైదరాబాద్: హైదరాబాద్‌లోని మణికొండలో ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించిన గోల్ఫ్ కోర్స్‌ను స్వయంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గోల్ఫ్‌కోర్స్‌తోపాటు విల్లాలు, విలాసవంతమైన అపార్టుమెంట్ల నిర్మాణానికి 1998లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 535 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్ కోర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే న్యాయ వివాదాల కారణంగా దాని నిర్వహణ ఆగిపోయింది.
గోల్ఫ్ కోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కొందరు విల్లాల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గోల్ఫ్ కోర్స్ నిర్వహణను చేపట్టే విషయాన్ని పరిశీలించాలని, అందులో ఖాళీగా ఉన్న భూమిని ఏ అవసరాలకు వినియోగించాలన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గోల్ఫ్ కోర్స్, విల్లాలు, క్లబ్, అపార్టుమెంట్ల నిర్మాణం తరువాత దాదాపు 50 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
జింకల పార్కుకు ప్రహారీ నిర్మాణం
నగరంలోని ఎల్.బి. నగర్ పరిధిలో ఉన్న హరిణి వనస్థలి జింకల పార్కును సంరక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పార్కు స్థలం కబ్జా కాకుండా చుట్టూ ప్రహారీగోడను నిర్మించాలని సూచించారు. పార్కు అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంగీకరించారు.
కేబీఆర్ పార్కు మాదిరి బొటానికల్ గార్డెన్
హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌ను బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్) మాదిరి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాకింగ్ కోసం వాక్‌వే నిర్మించాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.