అధికారులకే పగ్గాలు | Report to cm kcr on new panchayats | Sakshi
Sakshi News home page

అధికారులకే పగ్గాలు

Published Wed, Jul 25 2018 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

Report to cm kcr on new panchayats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వచ్చే సందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు.

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి  పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి విచక్షణాధికారాలను వినియోగించేందుకు జిల్లాకు కోటి చొప్పు న రూ.30 కోట్లు అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తుండటంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల  నియామకానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సర్పంచ్‌లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యం లో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో 8 గంటల పాటు సమీక్షించారు.

మంత్రులు జగదీశ్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ ఎస్‌.కె.జోషి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వివేకానంద, కాలె యాదయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజ్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, సీనియర్‌ అధికారులు వికాస్‌రాజ్, అరవింద్‌కుమార్, నీతూప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

పదవీకాలం ముగుస్తున్న సర్పం చ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని సీఎస్‌ నాయకత్వంలోని సీనియర్‌ అధికారుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించడం చట్ట ప్రకారం సాధ్యం కాదని, అందుకు న్యాయస్థానాలు అంగీకరించవని వెల్లడించారు. ప్రత్యేక అధికా రుల నియామకానికి చేస్తున్న కసరత్తును ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అధికారులనే ప్రత్యేక అధికారులుగా ఎందుకు నియమించాలో, చట్టం ఏం చెబుతుందో తెలిపారు.

ఆ వివరాలివీ..
రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,751కు చేరాయి. అసెంబ్లీలో చేసిన చట్టం ద్వారా కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రస్తు్తతం ఉన్న గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త చట్టం అమల్లోకి వస్తుందని చట్టంలోనే పేర్కొ న్నారు. దీని ప్రకారం ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. ప్రస్తుతమున్న పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. సర్పంచుల పరిధి మారుతుంది.
ఎస్టీలకు ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,500 గ్రామాల్లో ఎస్టీలే సర్పంచ్‌లు అవుతున్నారు. ఇప్పుడున్న సర్పంచ్‌లనే మళ్లీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తే, ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలనే కొనసాగించినట్టవుతుంది. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు మనుగడలోకి రావు. చట్టం సైతం ఇందుకు అంగీకరించదు.
ప్రస్తుతం ఉన్న గ్రామాల స్వరూపం పూర్తిగా మారి పోయింది. మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలు 300 వరకు ఉన్నాయి. ఈ గ్రామాలకు సర్పంచ్‌లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కొన్ని గ్రామాల శివారు పల్లెలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా అవతరించాయి. అవన్నీ ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలుగా మనుగడ సాగిస్తాయి. ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలు య«థావిధిగా ఉన్నవి ఐదు శాతం లోపే. ఇప్పుడున్న సర్పంచ్‌ల పరిధి ఇక ముందు ఉండదు. కాబట్టి వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడం కుదరదు.
ఇప్పుడున్న సర్పంచ్‌లు ఎన్నికైంది ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలకే. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు వారి అధికార పరిధిలో ఉండవు. వారు ఎన్నికైన గ్రామ స్వరూపానికి, ఇప్పుడున్న గ్రామ స్వరూపానికి సంబంధం లేదు. ఇప్పుడున్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా చేస్తే.. వారు పాత పంచాయతీల పరిధి మొత్తానికి ప్రత్యేక అధికారి అవుతారు. అప్పుడు ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలుగానీ, కొత్తగా ఏర్పడిన ఇతర పంచాయతీలుగానీ మనుగడలోకి రావు. ఇది చట్టానికి విరుద్ధం. అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి.
తండాలు, గూడేలతోపాటు కొత్తగా ఏర్పాటయిన పంచాయతీలు మనుగడలోకి రావాలని, కొత్త పాలక వర్గం వచ్చి, కొత్త పాలన ప్రారంభం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వ హించడానికి సిద్ధపడింది. అయితే కోర్టు కేసుల వల్ల సాధ్యం కాలేదు. కోర్టు తీర్పు వచ్చేలోపు కొత్త పంచాయతీలను మనుగడలోకి తేవడం ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతమున్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తే కొత్త పంచాయతీలు మనుగడలోకి వచ్చినట్లు లెక్కకాదు. అది చట్టాన్ని ఉల్లంఘించినట్టే.
ఈ కారణాల నేపథ్యంలో సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించలేని అసహాయ పరిస్థితి ప్రభుత్వానిదని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అధికారులకే పగ్గాలు అప్పగించడం ప్రభుత్వానికున్న ఏకైక మార్గమని అధికారులు స్పష్టం చేశారు.  


సర్పంచ్‌కు సీఎం ఫోన్‌
పంచాయతీలను బలోపేతం చేయడమెలా? గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శుల సేవలను ఎలా వినియోగించుకోవాలి? గ్రామ పంచాయతీలకు ఉండే ఖర్చు లేమిటి? ఆదాయాలేమిటి? తదితర విషయాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించారు.

ఈ సందర్భంగా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ సర్పంచ్‌ నర్సింహగౌడ్‌కు సీఎం స్వయంగా ఫోన్‌ చేసి గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం, కట్టే కరెంటు బిల్లు, సిబ్బందికి చెల్లించే వేతనాలు తదితర వివరాలను సేకరించారు. పంచాయతీరాజ్‌ సంస్థలు ఏటా కట్టే కరెంటు బిల్లులు ఎంతుంటాయని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డిని ఆరా తీయగా.. ఏటా రూ.600 కోట్ల బిల్లులు కడతారని ఆయన చెప్పారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement