
కాంట్రాక్టులపై సీవీసీ డేగకన్ను
న్యూఢిల్లీ: మంత్రిత్వ శాఖల్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కాంట్రాక్టు ప్రక్రియల్లో మరింత పారదర్శకత, వ్యయ నియంత్రణ సాధించే దిశగా కొత్తగా పలు నియమనిబంధనలను కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మంగళవారం జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖల్లోని చీఫ్ విజిలెన్స్ అధికారులు(సీవీఓ) కచ్చితంగా నిర్వహించాల్సిన పలు విధులను వాటిలో పొందుపర్చింది. ఆ వివరాల ప్రకారం.. ‘ప్రతీ విభాగంలోని సీవీఓ తన విభాగ పరిధిలో, ఏడాది కాలంలో చోటుచేసుకున్న కాంట్రాక్టుల్లో కొన్నింటిని రాండమ్‌గా ఎంపిక చేసుకుని, వాటిని నిశిత పరీక్ష(ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్) జరపాలి.
అలా యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకునేందుకు కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. కాంట్రాక్టుల విలువల ఆధారంగా వాటిని భారీ, సుమారు, చిన్న కాంట్రాక్టులుగా విభజించి, ఒక ఏడాదిలో కనీసం మూడు భారీ, రెండు సుమారు, ఒక చిన్న కాంట్రాక్ట్‌ను నిశిత పరీక్ష కోసం ఎంపిక చేసుకోవాలి. టెండర్లు కోరుతూ ఇచ్చే పేపర్ ప్రకటన నుంచి తుది అనుమతి వరకూ అన్ని ప్రక్రియలనూ నిశితంగా పరీక్షించాలి. అనంతరం మొదట ప్రాథమిక నివేదికను రూపొందించి, లోటుపాట్లుంటే సంబంధిత విభాగాల అధిపతుల నుంచి కాలపరిమితితో కూడిన సమాధానం తెప్పించుకోవాలి. ఆ తరువాత తుది నివేదికను సిద్ధం చేయాలి’ అని ఆ గైడ్‌లైన్స్‌లో సీవీసీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు సీవీఓల త్రైమాసిక నివేదికల ఆధారంగా చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్స్ ఆర్గనైజేషన్ విధుల్లో భాగంగా ఈ నిశిత పరీక్ష ఉండేది.