ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది.
ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్‌లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!
రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది.
ఆ విషయమై పిటిషన్‌ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్‌రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం.
దయచేసి బెడ్‌రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్‌లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్‌లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు.
మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట.
ఇతర దేశాల్లో..
దక్షిణ కొరియా
ఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్‌లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్‌గా పొందొచ్చు.
జపాన్
జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.
చైనా
చైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.
(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?)
Comments
Please login to add a commentAdd a comment