ఢిల్లీ: దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ ఘటనలపై స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రన్ని ఆదేశించింది. 'బచ్పన్ బచావో ఆందోళన్' అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటీషన్పై విచారణ సందర్భంగా జస్టీస్ లోకూర్, లలిత్లతో కూడిన ధర్మాసనం చిన్నారుల మిస్సింగ్ నివారణకు స్పష్టమైన విధానాలను తయారుచేయాలని ఆదేశించింది. అలాగే కోయాపాయ, ట్రాక్దమిస్సింగ్చైల్డ్ వెబ్సైట్లను అనుసంధానం చేయాల్సిందిగా ఉన్నత ధర్మాసనం మహిళా, శిశు సంక్షేమ శాఖను కోరింది.
ఇటీవలి కాలంలో చిన్నారుల మిస్సింగ్ ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని నివారించడానికి సీనియర్ లాయర్ హెచ్ ఎస్ పూల్కాను చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పటిష్టంగా అమలవడానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించడానికి నియమించింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్)లో ఖాళీగా ఉన్నటువంటి చైర్ పర్సన్ పోస్టును, ఇతర ఉద్యోగులను సత్వరమే బర్తీ చేయాల్సిందిగా మంత్రిత్వ శాఖను ఆదేశించిన ధర్మాసనం రాష్ట్రాల వారిగా అదృశ్యమైన చిన్నారుల జాబితాను కోర్టుకు మార్చ్ 21 లోగా సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.