హిమాయత్‌నగర్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలలు దారుణంగా హత్యకు గురికావడంపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమీషనర్‌లకు నోటీసులను జారీ చేసింది. హయత్‌నగర్ ఘటనపై బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధరావు మాట్లాడుతూ కావడ్‌పల్లి సమీపంలో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో వలస కూలీలుగా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజ్‌కుమార్, బులేషి దంపతుల పిల్లలు ధర్మరాజు(10), ముఖేష్(6)లు 18వ తేదీన అదృశ్యమయై గురువారం మృత దేహాలుగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం, వలస కూలీల పిల్లలకు విద్య, వైద్యం, రక్షణ లాంటి చర్యలు ఏం తీసుకుంటున్నారో తమకు జూన్ 16 వ తేదీ లోపు తెలపాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులను జారీ జేశామన్నారు.