Childrens Rights Commission
-
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రాధిక షాద్‌నగర్ క్రైం/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: పిండి నేలపై పారబోసిందని క్షణికావేశంలో కన్నకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలిక మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడకి చెందిన చెన్నయ్య, స్వరూప దంపతులు గత శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడుతున్నారు. అప్పుడే వీరి చిన్న కుమార్తె రాధిక (9) రొట్టెల పిండిని తీసుకొస్తూ కింద పడేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి స్వరూప కూతురి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గ్రామస్తులు రాధికను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన రాధిక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మంగళవారం రాధిక మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఆ తల్లిపై హత్యకేసు పెట్టాలి: బాలల హక్కుల సంఘం క్షణికావేశంలో కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించి మరణానికి కారణమైన తల్లి స్వరూపపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరికొన్ని ఇళ్లల్లో.. రాధిక లాగే మిగిలిన పిల్లలకు రక్షణ లేదని, తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణాపాయం పొంచి ఉందన్న అభిప్రాయాన్ని ఆ సంఘం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించి వారి బాగోగులు చూసుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. -
అవమాన భారం.. విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: గుంటూరులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఉదంతం మరువకముందే మరో ఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ముందు ఓ లెక్చరర్ దూషించి, అవమాన పరచడంతో ఎస్ఆర్నగర్లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు సదరు లెక్చరర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ను నిందితులుగా చేర్చారు. ఆది నుంచీ చదువుల తల్లే... మోతీనగర్‌లో నివసించే ఎల్లయ్య, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఎల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అలివేలు గృహిణి. వీరి రెండో సంతానమైన శ్రీవర్ష(17) ఎస్ఆర్నగర్లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ప్రాణంగా భావించే శ్రీవర్ష పదో తరగతిలో 8.5 జీపీఏ, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 92 శాతం మార్కులు సాధించింది. అనారోగ్యం కారణంగా ఇటీవల కొన్ని రోజుల పాటు కళాశాలకు వెళ్లలేకపోరుుంది. ఫిజిక్స్ లెక్చరర్ ప్రవర్తనతో విసిగి... అనారోగ్యం తరువాత కోలుకున్న శ్రీవర్ష ఈ నెల 12న కళాశాలకు వెళ్లింది. ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ముందు శ్రీవర్ష పట్ల అవమానకరంగా మాట్లాడాడు. పక్కన కూర్చో బెట్టుకుని మరీ అందరి ముందూ పరుష పదజా లంతో దూషించాడు. ‘కళాశాలకు ఎందుకొస్తావ్... పరీక్ష ఎందుకు రాయలేదు.. నీ లాంటి వాళ్ల వల్లే కళాశాలకు చెడ్డ పేరు వస్తోంది... టీసీ ఇచ్చి పంపించేస్తాం’అంటూ బెదిరించాడు. ఆ నాటి నుంచి తీవ్ర మానసిక క్షోభకు గురైన విద్యార్థిని కళాశాలకు వెళ్లడం మానేసింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి హాల్లో పైకప్పు రెరుులింగ్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి నిద్రలేచిన కుటుంబ సభ్యులకు శ్రీవర్ష వేలాడుతూ కనిపించింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు ఐపీసీ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించడం) కింద లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఉమపై కేసు నమోదు చేశారు. ఫీజులు ఇస్తా... నా కూతుర్ని తిరిగిస్తారా - శ్రీవర్ష తల్లి అలివేలు లెక్చరర్ తీవ్రంగా అవమానించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రీవర్ష తల్లి అలివేలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పారు. కళాశాల ఫీజు చెల్లించడం ఆలస్యమైతే మాత్రం అందుకు కారణాలను తరగతి గదిలో రాతపూర్వకంగా రారుుంచుకునే యాజమాన్యం విద్యార్థుల బాగోగులు పట్టించుకోదంటూ ఆమె మండిపడ్డారు. ఫీజులు చెల్లిస్తాం... నా కుమార్తెను తీసుకువస్తారా? అంటూ ఏడవటం అక్కడివారిని కలచివేసింది. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు - శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య ఇలాంటి కడుపు కోత మరెవ్వరికీ రాకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడుతున్న నారాయణ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, అప్పుడు ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు తమకు ఈ కడుపుకోత ఉండేది కాదంటూ విలపించారు. కళాశాలను మూసివేయాలి - బాలల హక్కుల సంఘం లెక్చరర్ అవమానపరచడంతో మానసిక ఒత్తిడికి గురైన శ్రీవర్ష బలవన్మరణానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పేర్కొన్నారు. లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఉమను అరెస్టు చేసి, నారాయణ కళాశాలను మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. లెక్చరర్‌ను అరెస్టు చేసి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శ్రీవర్ష ఆత్మహత్య చేసుకునేలా నారాయణ కళాశాల సిబ్బంది వ్యవహరించడాన్ని యువజన కాంగ్రెస్ తప్పుబట్టింది. -
అమానుషం!
కవల చిన్నారులపై తండ్రీకొడుకుల లైంగికదాడి రాజేంద్రనగర్: మానవత్వం మరిచిన తండ్రీకొడుకులు క్రూరంగా మారారు. రాక్షసత్వం ప్రదర్శించి అభం శుభం తెలియని చిన్నారులపై తమ వికృత రూపం చూపించారు. కవల చిన్నారులపై తండ్రీకొడుకులు లైంగికదాడికి పాల్పడిన ఘోర సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల సంఘం చొరవతో ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు వివరాల ప్రకారం.. లక్ష్మిగూడ రాజీవ్‌గృహకల్ప బ్లాక్ నెంబర్.24లో కిరణ్‌మిశ్రా, లవేష్‌మిశ్రా దంపతులు నివాసముంటున్నారు. వీరు నేపాల్ నుంచి వలస వచ్చారు. వీరికి కవలలైన ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. లవేష్‌మిశ్రా స్థానికంగా ఓ బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పదేళ్ల వయసున్న కవల బాలికలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. అరుుతే వీరి ఇంటి పక్కనే జాఫర్, అతడి కుమారుడు బషీర్ గత కొన్ని రోజులుగా ఈ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని తల్లికి తెలిపినా ఆమె పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో చిన్నారులు గురువారం ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం తెలపగా, వారు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావుకు సమాచారం అందించారు. సంఘం ప్రతినిధులు సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, శంషాబాద్ డీసీపీ పద్మజా, రాజేంద్రనగర్ ఏసీపీ రంగారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులతో పాటు చిన్నారులను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాలికల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి హైదర్షాకోట్లోని కస్తూర్భా ట్రస్ట్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులను ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ శాండిల్యా రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొని కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉండడంతో వారిని ప్రశ్నించారు. కఠినంగా శిక్షించాలి... నిందితులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు. రోజు రోజుకు పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాతలు పెట్టి.. ఫొటోలు తీసి
ఆరేళ్ల బాలుడిపై తల్లి కర్కశత్వం హిమాయత్‌నగర్: అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడికి స్వయంగా అతని తల్లి వాతల పెట్టడమేగాక ఫొటోలను స్నేహితులకు పంపి ఆనందం పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు నారాయణగూడ కార్యాలయంలో ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తి తన భార్య తన కుమారుడిని కొడుతోందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అల్లరి చేస్తున్నాడన్న కారణంగా అట్లకర్ర కాల్చి శరీరంపై వాతలు పెట్టడమేగాక, గాయాలను సెల్ఫోన్లో ఫొటోలు తీసి తన స్నేహితులకు పంపుతోందన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాన్ని కోరారు. తక్షణం బాలుడి తల్లిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
‘చిన్నారుల హత్యలపై చర్యలేవి?'
హిమాయత్‌నగర్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలలు దారుణంగా హత్యకు గురికావడంపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమీషనర్లకు నోటీసులను జారీ చేసింది. హయత్‌నగర్ ఘటనపై బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధరావు మాట్లాడుతూ కావడ్పల్లి సమీపంలో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో వలస కూలీలుగా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజ్‌కుమార్, బులేషి దంపతుల పిల్లలు ధర్మరాజు(10), ముఖేష్(6)లు 18వ తేదీన అదృశ్యమయై గురువారం మృత దేహాలుగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం, వలస కూలీల పిల్లలకు విద్య, వైద్యం, రక్షణ లాంటి చర్యలు ఏం తీసుకుంటున్నారో తమకు జూన్ 16 వ తేదీ లోపు తెలపాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులను జారీ జేశామన్నారు. -
మేం పెళ్లి చేసుకుంటాం!
♦ ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్ ♦ మేజర్‌నని, పెళ్లికి అనుమతించాలని కోర్టుకు విన్నపం సాక్షి, హైదరాబాద్: కన్నతండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లబోతోందా..? ఇందుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సొంత తల్లి మరణంతో సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో గతేడాది మీడియా, బాలల హక్కుల సంఘం చొరవతో ప్రత్యూష ఆస్పత్రిలో చేరటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు స్పందనతో ప్రభుత్వ అధీనంలోని ఓ సంరక్షణ కేంద్రంలో చేర్పించి ఆమె యోగక్షేమాలు చూస్తూ వస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వొకేషనల్ పరీక్ష కూడా పాసైంది. బీఎస్సీ నర్సింగ్ చేయటమే తన లక్ష్యంగా చెప్పిన ఆమె.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటిరెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని మహిళా సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా తెలిపింది. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసే యత్నం చేస్తున్నా.. ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్న ని, తన ఇష్టప్రకారం చేయాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటిరెడ్డి? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటిరెడ్డి(27) బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్నాడు. గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్న తన మిత్రుడి పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించేందుకు వెళ్లి, ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఇలా వరుసగా రెండ్రోజులు వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లాడు. ప్రభుత్వ సంరక్షణలో చేరిన తర్వాత మద్దిలేటికి ప్ర త్యూష ఫోన్ చేయటం, అతను కూడా ఆమెకు ఫోన్లు చేయటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా నేను హాస్టల్లో ఉండలేను. మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తా. హాస్టల్లో అన్నంలో సోడా వేస్తున్నారు. ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నా. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోంది. - ప్రత్యూష ఆమెనే పెళ్లి చేసుకుంటా ప్రత్యూషను ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పేవాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటా. - మద్దిలేటిరెడ్డి కౌన్సెలింగ్ ఇప్పించాలి ప్రత్యూషను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత.. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదు. ఆమె వెంటనే అక్కడ్నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు మానసిక వైద్యులతో శిక్షణ ఇప్పించాలి. - అచ్యుతరావు,బాలల హక్కుల కమిషన్ సభ్యులు -
ఇదేం పని?
పేరుకే బాలల హక్కుల కమిషన్ కనీస సౌకర్యాలు నిల్ రెండు నెలల క్రితమే సర్కారుకు నోటీసులు లోకాయుక్త ఆదేశాలూ బేఖాతరు సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో టేబుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. కానీ దాన్ని నిలబెట్టడానికి ఇటుకలు, రాళ్లు ఆధారంగా ఉంచాల్సిందే.. ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ ఉన్నట్టే ఉంటాయి. పనిచేసేది అనుమానమే.. ఉన్నదే ఒక్క గది.. చూడబోతే స్టోర్‌రూమ్‌ను తలపిస్తుంది.. ఇదీ బాలల హక్కుల కమిషన్ దుస్థితి. ఆర్భాటంగా కమిషన్ ఏర్పాటైతే చేశారు కానీ.. అందులోని బాధ్యులెవరూ ఇక్కడ పట్టుమని పది నిమిషాలు కూర్చుని పనిచేసే పరిస్థితి లేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా (ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా) రహీముద్దీన్, పి.అచ్యుతరావు, ఎం.సుమిత్ర, ఎస్.మురళీధర్‌రెడ్డి, మమతా రఘువీర్, ఎస్.బాలరాజును నియమించింది. నెలైనా వీరికి కార్యాలయం సమకూర్చలేదు. దీంతో సభ్యులు కార్యకలాపాలను తమ ఇళ్ల నుంచే సాగించారు. కమిషన్ కష్టాలు పత్రికలలో రావడంతో లోకాయుక్త సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమిషన్‌కు కార్యాలయం, సిబ్బందిని కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ శ్యాంసుందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నేటి వరకు లోకాయుక్త ఆదేశాలపై, నోటీసుపై ఎలాంటి స్పందన లేదు. తూతూ మంత్రంగా యూసుఫ్‌గూడలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో చిన్నపాటి గదిని మాత్రం ఇచ్చారు. అందులో ఆరుగురు సభ్యులకు కలిసి మూడంటే మూడే కుర్చీలు (అవి కూడా కాలు విరిగినవి) సమకూర్చారు. ఇక తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. సౌకర్యాలు ఈ రకంగా ఉంటే ఇక ఒక్కరంటే ఒక్క సిబ్బందినీ ఇంతవరకూ కేటాయించలేదు. 2013 జీఓ నెంబర్ 5 ప్రకారం కమిషన్ సభ్యులకు ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. కార్యకలాపాలు సాగేందుకు వీలు లేక.. దీన స్థితిలో బాలల హక్కుల కమిషన్ ఉందంటే బాలలపై ప్రభుత్వం ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది. -
హెరిటేజ్ సహా.. పాల కంపెనీలపై ఫిర్యాదు
వాటిని రద్దు చేయాలని లోకాయుక్తకు వినతి సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని హరించే విషపూరితమైన పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న హెరిటేజ్ సహా పలు పాల కంపెనీల విక్రయాలను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. హెరిటేజ్, విజయ, రిలయన్స్, నంది, నెస్లే, మదర్‌డెయిరీ, జెర్సీ పాలల్లో ప్రమాదకరమైన బాక్టీరియా, యూరియాలు ఉంటున్నాయని ప్రభుత్వ ఆహార విశ్లేషణ్ సంస్థ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆయా కంపెనీల విక్రయాలను వెంటనే నిలిపి వేయాలని సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి జనవరి 6 లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఆయా పాల కంపెనీలపై ఎందుకు చర్యలు చేపట్టలేదో సమాధానమివ్వాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్లను కోరారు.