మేం పెళ్లి చేసుకుంటాం! | We will marry! | Sakshi
Sakshi News home page

మేం పెళ్లి చేసుకుంటాం!

Published Wed, May 4 2016 3:09 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

మేం పెళ్లి చేసుకుంటాం! - Sakshi

మేం పెళ్లి చేసుకుంటాం!

♦ ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్
♦ మేజర్‌నని, పెళ్లికి అనుమతించాలని కోర్టుకు విన్నపం
 
 సాక్షి, హైదరాబాద్: కన్నతండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లబోతోందా..? ఇందుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సొంత తల్లి మరణంతో సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో గతేడాది మీడియా, బాలల హక్కుల సంఘం చొరవతో ప్రత్యూష ఆస్పత్రిలో చేరటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు స్పందనతో ప్రభుత్వ అధీనంలోని ఓ సంరక్షణ కేంద్రంలో చేర్పించి ఆమె యోగక్షేమాలు చూస్తూ వస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వొకేషనల్ పరీక్ష కూడా పాసైంది. బీఎస్సీ నర్సింగ్ చేయటమే తన లక్ష్యంగా చెప్పిన ఆమె.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటిరెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని మహిళా సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా తెలిపింది. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసే యత్నం చేస్తున్నా.. ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్‌న ని, తన ఇష్టప్రకారం చేయాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది.

 ఎవరీ మద్దిలేటిరెడ్డి?
 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటిరెడ్డి(27) బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్నాడు. గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్న తన మిత్రుడి పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించేందుకు వెళ్లి, ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఇలా వరుసగా రెండ్రోజులు వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లాడు. ప్రభుత్వ సంరక్షణలో చేరిన తర్వాత మద్దిలేటికి ప్ర త్యూష ఫోన్ చేయటం, అతను కూడా ఆమెకు ఫోన్లు చేయటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది.
 
 హాస్టల్‌లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా
 నేను హాస్టల్‌లో ఉండలేను. మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తా. హాస్టల్‌లో అన్నంలో సోడా వేస్తున్నారు. ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నా. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోంది.    
     - ప్రత్యూష
 
 ఆమెనే పెళ్లి చేసుకుంటా
 ప్రత్యూషను ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పేవాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటా.
     - మద్దిలేటిరెడ్డి
 
 కౌన్సెలింగ్ ఇప్పించాలి
 ప్రత్యూషను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత.. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదు. ఆమె వెంటనే అక్కడ్నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు మానసిక వైద్యులతో శిక్షణ ఇప్పించాలి.     
- అచ్యుతరావు,బాలల హక్కుల కమిషన్ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement