ఇదేం పని?
- పేరుకే బాలల హక్కుల కమిషన్
- కనీస సౌకర్యాలు నిల్
- రెండు నెలల క్రితమే సర్కారుకు నోటీసులు
- లోకాయుక్త ఆదేశాలూ బేఖాతరు
సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో టేబుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది.
కానీ దాన్ని నిలబెట్టడానికి ఇటుకలు, రాళ్లు ఆధారంగా ఉంచాల్సిందే..
ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ ఉన్నట్టే ఉంటాయి. పనిచేసేది అనుమానమే..
ఉన్నదే ఒక్క గది.. చూడబోతే స్టోర్‌రూమ్‌ను తలపిస్తుంది..
ఇదీ బాలల హక్కుల కమిషన్ దుస్థితి. ఆర్భాటంగా కమిషన్ ఏర్పాటైతే చేశారు కానీ.. అందులోని బాధ్యులెవరూ ఇక్కడ పట్టుమని పది నిమిషాలు కూర్చుని పనిచేసే పరిస్థితి లేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా (ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా) రహీముద్దీన్, పి.అచ్యుతరావు, ఎం.సుమిత్ర, ఎస్.మురళీధర్‌రెడ్డి, మమతా రఘువీర్, ఎస్.బాలరాజును నియమించింది.
నెలైనా వీరికి కార్యాలయం సమకూర్చలేదు. దీంతో సభ్యులు కార్యకలాపాలను తమ ఇళ్ల నుంచే సాగించారు. కమిషన్ కష్టాలు పత్రికలలో రావడంతో లోకాయుక్త సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమిషన్‌కు కార్యాలయం, సిబ్బందిని కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ శ్యాంసుందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నేటి వరకు లోకాయుక్త ఆదేశాలపై, నోటీసుపై ఎలాంటి స్పందన లేదు.
తూతూ మంత్రంగా యూసుఫ్‌గూడలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో చిన్నపాటి గదిని మాత్రం ఇచ్చారు. అందులో ఆరుగురు సభ్యులకు కలిసి మూడంటే మూడే కుర్చీలు (అవి కూడా కాలు విరిగినవి) సమకూర్చారు. ఇక తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. సౌకర్యాలు ఈ రకంగా ఉంటే ఇక ఒక్కరంటే ఒక్క సిబ్బందినీ ఇంతవరకూ కేటాయించలేదు.
2013 జీఓ నెంబర్ 5 ప్రకారం కమిషన్ సభ్యులకు ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. కార్యకలాపాలు సాగేందుకు వీలు లేక.. దీన స్థితిలో బాలల హక్కుల కమిషన్ ఉందంటే బాలలపై ప్రభుత్వం ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది.