అవమాన భారం.. విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: గుంటూరులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఉదంతం మరువకముందే మరో ఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ముందు ఓ లెక్చరర్ దూషించి, అవమాన పరచడంతో ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు సదరు లెక్చరర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ను నిందితులుగా చేర్చారు.
ఆది నుంచీ చదువుల తల్లే...
మోతీనగర్‌లో నివసించే ఎల్లయ్య, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఎల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అలివేలు గృహిణి. వీరి రెండో సంతానమైన శ్రీవర్ష(17) ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ప్రాణంగా భావించే శ్రీవర్ష పదో తరగతిలో 8.5 జీపీఏ, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 92 శాతం మార్కులు సాధించింది. అనారోగ్యం కారణంగా ఇటీవల కొన్ని రోజుల పాటు కళాశాలకు వెళ్లలేకపోరుుంది.
ఫిజిక్స్ లెక్చరర్ ప్రవర్తనతో విసిగి...
అనారోగ్యం తరువాత కోలుకున్న శ్రీవర్ష ఈ నెల 12న కళాశాలకు వెళ్లింది. ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ముందు శ్రీవర్ష పట్ల అవమానకరంగా మాట్లాడాడు. పక్కన కూర్చో బెట్టుకుని మరీ అందరి ముందూ పరుష పదజా లంతో దూషించాడు. ‘కళాశాలకు ఎందుకొస్తావ్... పరీక్ష ఎందుకు రాయలేదు.. నీ లాంటి వాళ్ల వల్లే కళాశాలకు చెడ్డ పేరు వస్తోంది... టీసీ ఇచ్చి పంపించేస్తాం’అంటూ బెదిరించాడు. ఆ నాటి నుంచి తీవ్ర మానసిక క్షోభకు గురైన విద్యార్థిని కళాశాలకు వెళ్లడం మానేసింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి హాల్‌లో పైకప్పు రెరుులింగ్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి నిద్రలేచిన కుటుంబ సభ్యులకు శ్రీవర్ష వేలాడుతూ కనిపించింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు ఐపీసీ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించడం) కింద లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఉమపై కేసు నమోదు చేశారు.
ఫీజులు ఇస్తా... నా కూతుర్ని తిరిగిస్తారా
- శ్రీవర్ష తల్లి అలివేలు
లెక్చరర్ తీవ్రంగా అవమానించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రీవర్ష తల్లి అలివేలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పారు. కళాశాల ఫీజు చెల్లించడం ఆలస్యమైతే మాత్రం అందుకు కారణాలను తరగతి గదిలో రాతపూర్వకంగా రారుుంచుకునే యాజమాన్యం విద్యార్థుల బాగోగులు పట్టించుకోదంటూ ఆమె మండిపడ్డారు. ఫీజులు చెల్లిస్తాం... నా కుమార్తెను తీసుకువస్తారా? అంటూ ఏడవటం అక్కడివారిని కలచివేసింది.
ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు
- శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య
ఇలాంటి కడుపు కోత మరెవ్వరికీ రాకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడుతున్న నారాయణ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, అప్పుడు ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు తమకు ఈ కడుపుకోత ఉండేది కాదంటూ విలపించారు.
కళాశాలను మూసివేయాలి
- బాలల హక్కుల సంఘం
లెక్చరర్ అవమానపరచడంతో మానసిక ఒత్తిడికి గురైన శ్రీవర్ష బలవన్మరణానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పేర్కొన్నారు. లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఉమను అరెస్టు చేసి, నారాయణ కళాశాలను మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. లెక్చరర్‌ను అరెస్టు చేసి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శ్రీవర్ష ఆత్మహత్య చేసుకునేలా నారాయణ కళాశాల సిబ్బంది వ్యవహరించడాన్ని యువజన కాంగ్రెస్ తప్పుబట్టింది.