పావని మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తండ్రి. (ఇన్‌సెట్‌లో) పావని (ఫైల్)
కడప అర్బన్/చింతకొమ్మదిన్నె/కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని కృష్ణాపురంలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల బాలికల హాస్టల్ క్యాంపస్‌లో శుక్రవారం తెల్లవారుజా మున చెన్నూరు పావని (17) అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కళాశాల సిబ్బంది మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పత్తాలే కుండా పోయారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు రిమ్స్‌కు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సిద్దవటం మండలం పేర య్యగారిపల్లెకు చెందిన పావని కృష్ణాపురం నారాయణ జూనియర్ కళాశాల క్యాంపస్‌లో ఇంటర్ (ఎంపీసీ) మొదటి ఏడాది చదువు తోంది. అదే క్యాంపస్‌లో ఉన్న హాస్టల్‌లోని ఒక గదిలో 12 మంది విద్యార్థినులతో కలసి ఉంటోంది.
ఎంపీసీ క్లవర్ బ్యాచ్‌లో పావని టాప్ 10లో ఉంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన పావని 4వ తేదీ సాయంత్రం కళాశాలకు వెళ్లింది. ఎప్పటి లాగే తోటి విద్యార్థులతో సరదాగా గడిపింది. గురువారం రాత్రి సహచర విద్యార్థినులతో కలిసి నిద్రపోయిన పావని.. శుక్రవారం తెల్లవారు జామున శవమై కనిపించింది. తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రిమ్స్‌కు తరలించారు. పావని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచి, ఉదయం 5.45 గంటలకు మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పావని అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండేళ్లలో ముగ్గురు..
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని కృష్ణాపురం నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారి. ఈ కళాశాల హాస్టల్‌లో 2015 ఆగస్టు 17వ తేదీ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న నందిని, మనీషారెడ్డి ఒకే గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున కడపకు చెందిన పావని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment