విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరపాలంటూ అంబులెన్సు ముందు బైఠాయించిన విద్యార్థి సంఘం నాయకులను చెదరగొడుతున్న పోలీసులు
♦ విజయవాడ ‘నారాయణ’ విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతిపై సందేహాలు
♦ కర్రలతో కొట్టినట్లు మృతదేహంపై ఆనవాళ్లు!
♦ కాలేజీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు
♦ హఠాత్తుగా సెలవులు ప్రకటించిన యాజమాన్యం
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ శివారు గూడ వల్లిలో నారాయణ కాలేజీ విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన ఘటనపై 24 గంటలు గడిచినా హత్యా..ఆత్మహత్యా? అనేది తేలకపోవటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా డని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను కర్రలతో కొట్టి చంపేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. మరోవైపు తమ సహచరుడి అనుమానా స్పద మృతిపై నారాయణ విద్యార్థులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోపోద్రిక్తులైన దాదాపు 1,700 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి కాలేజీ భవనాల అద్దాలు, ఫర్నిచర్ «ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం అప్పటికప్పుడు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్
ఈశ్వర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం తదితర సంఘాలు నారాయణ కాలేజీ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించాయి. మంత్రి నారాయణను వెంటనే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. నారాయణ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఈశ్వర్‌రెడ్డి మృతిని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ శ్రీధర్‌బాబు తెలిపారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఈశ్వర్‌రెడ్డి ఆదివారం ఉదయం కూడా తరగతులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం కాలేజీలో నిర్వహించిన వారంతపు పరీక్ష కూడా రాశాడు. అలాంటిది సాయంత్రం అయ్యేసరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? హాస్టల్ గదిలో ఉరివేసుకుంటుంటే సహ విద్యార్థులు గమనించరా? విద్యార్థులు అంతా తరగతి గదిలో ఉంటే ఈశ్వర్‌రెడ్డి ఒక్కడే హాస్టల్‌కు ఎందుకు వెళ్లాడు? ఓ విద్యార్థి తరగతి గదిలో లేకుంటే ప్రిన్సిపల్, అధ్యాపకులు, సూపర్‌వైజర్లు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యం సమాధానాలు చెప్పట్లేదు.
సాయంత్రం 4.45 గంటలకు విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించినా వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సహవిద్యార్థులు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి చెబితేనే ఈశ్వర్‌రెడ్డి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఈశ్వర్‌రెడ్డి ఎలాంటి ఆత్మహత్య లేఖ రాయలేదని పోలీసులు చెబుతున్నారు. మరి అలాంటి లేఖ ఏదీ లేకుండానే ఆత్మహత్య అని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్నది అంతుచిక్కుండా ఉంది.
కొట్టి చంపారా?
ఈశ్వర్‌రెడ్డి మృతదేహంపై కర్రలతో కొట్టిన గుర్తులు ఉండటం గమనార్హం. విద్యార్థిని కొట్టి చంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వాహకుల్లో ఒకరు కొట్టారని కొందరు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ వాస్తవం బయటపడదు.
మా అబ్బాయిని హత్య చేశారు: తల్లిదండ్రులు
మా అబ్బాయిని కర్రలతో కొట్టి చంపారు. ఒంటి మీద కర్రలతో కొట్టిన వాతలు స్పష్టంగా ఉన్నాయి. చదువులో చురుగ్గానే ఉండేవాడు. మా బిడ్డ ఆత్మహత్మ చేసుకునేంత పిరికివాడు కాదు. – మల్లారెడ్డి, మంగమ్మ (ఈశ్వర్‌రెడ్డి తల్లిదండ్రులు)