
సీబీఐ ద్వంద్వ ప్రమాణాలు!
న్యూఢిల్లీ: ప్రముఖులపై అవినీతి కేసుల దర్యాప్తులో సీబీఐ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదన్న ఆరోపణలతో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఆందోళన వెలిబుచ్చింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజవాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తదితర ప్రముఖ నేతలు అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై దాఖలైన వేర్వేరు కేసుల్లో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండడంపై ఇండియా రిజునవేషన్ ఇనీషియేటివ్(ఐఆర్‌ఐ) అనే స్వచ్ఛంద సంస్థ సీవీసీకి ఫిర్యాదు చేసింది.
సరిహద్దు భద్రతా దళం మాజీ డెరైక్టర్ జనరల్ ప్రకాశ్ సింగ్, మరికొందరు ప్రముఖులు ఐఆర్‌ఐ తరఫున సీవీసీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ప్రముఖ నేతలపై దాఖలైన కొన్ని కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చకచకా దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ.. మరికొందరు ప్రముఖులపై దాఖలైన కేసుల్లో మాత్రం దర్యాప్తును వీపరీత జాప్యం చేయడాన్ని వారు తప్పుపట్టారు. ‘పాలక పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తున్నదన్న బలమైన అభిప్రాయం కలిగించేలా ఈ సంస్థ పనితీరు ఉంటున్నద’ని వారు గత నెల 30న సీవీసీకి ఫిర్యాదు చేశారు.
‘ప్రభుత్వం ఏదైనా కేసును కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టాలనుకుంటే, సీబీఐ అదేపని చేస్తుంది. అదేవిధంగా, ప్రభుత్వం ఏదైనా కేసును చకచకా తేల్చాలని తలపెడితే, సీబీఐ అందుకు అనుగుణంగా చప్పున స్పందిస్తుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ములాయం, మాయావతి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న కేసులు.. రైల్‌గేట్ కుంభకోణంలో రైల్వే మంత్రి సమీప బంధువు విజయ సింగ్లపై కేసు, గుజరాత్‌లో ఇషత్ ్రజహాన్ ‘నకిలీ ఎన్‌కౌంటర్’ వంటి ప్రముఖులతో సంబంధం ఉన్న కేసుల్లో సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరులో ‘తేడా’ను ఫిర్యాదులో ఎత్తిచూపారు. అవినీతి కేసులపై సీబీఐ దర్యాప్తు తీరును సీవీసీ పర్యవేక్షిస్తుంటుంది. అందుకే సీబీఐ వివిధ కేసుల్లో పాటిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రకాశ్ సింగ్ తదితరులు సీవీసీ దృష్టికి తీసుకెళ్లారు.