ఆమ్ ఆద్మీలో రగిలిన విభేదాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లను పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి తొలగించటానికి ఆప్ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆప్ నేత సంజయ్ సింగ్ సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను పార్టీ కన్వీనర్ పదవి నుంచి తొలగించటానికి పలువురు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ యోగేంద్ర, ప్రశాంత్ లపేర్లు ప్రస్తావించకుండానే వారిపై ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్‌ను తొలగించి యోగేంద్రకు పార్టీ కన్వీనర్ పదవి ఇవ్వాలంటూ మరో సీనియర్ నేత శాంతి భూషణ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలనూ ఆయన తప్పుబట్టారు. ‘‘పార్టీ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్‌ను తొలగించాలని కొందరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్టీ పేరునూ చెడగొడుతున్నారు’’ అని విమర్శించారు. ఇటీవల కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలు పార్టీని పరిహసించేలా, ఎగతాళి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆ లేఖలను లీక్ చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. వాటిని మీడియా ద్వారా ప్రజల ముందుకు తేవటానికి బదులుగా ఆ విషయాలను పార్టీ వేదికపై చర్చించి ఉండొచ్చని పేర్కొన్నారు.
పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ బుధవారం సమావేశమై.. తాజా వివాదంతో సహా అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే యోగేంద్ర, ప్రశాంత్‌లను పీఏసీ నుంచి తొలగించే అవకాశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు. గత వారం జరిగిన కార్యవర్గ భేటీలోనే కేజ్రీవాల్ రాజీనామాకు సిద్ధపడ్డారని, అయితే పార్టీ నేతలంతా అందుకు అనుమతించలేదని, పార్టీ జాతీయ కన్వీనర్‌గా ఆయనే కొనసాగాలని కోరినట్లు సంజయ్ తెలిపారు. ఆయన్ను తొలగించాలని కోరుతున్న వారు పార్టీ కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
వారిద్దరిపై తీర్మానం ప్రవేశపెడతాం...
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా యోగేంద్ర కుట్రపన్నారని, ఆయనను పీఏసీ నుంచి తొలగించాల్సిందిగా బుధవారం జరిగే కార్యనిర్వాహక కమిటీ భేటీ తీర్మానం ప్రవేశపెడతానని ఈ కమిటీ సభ్యుడు నవీన్ జైహింద్ చెప్పారు. యోగేంద్ర, ప్రశాంత్‌లను పీఏసీ నుంచి తొలగించాలని తాము తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయని కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన మరో నేత పేర్కొన్నారు. పార్టీ నడిచే పద్ధతి ఒకటి ఉందని.. ఇప్పుడు తలెత్తిన సమస్యలు తీవ్రమైనవని అన్నారు. పార్టీలో ఒకరికి ఒక పదవే ఉండాలని, ఒక్క వ్యక్తి కేంద్రంగా నడిచే ఇతర పార్టీలకు భిన్నంగా ఉండాలని, అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లివిరియాలని ప్రశాంత్ భూషణ్ గతంలో లేఖ రాశారు.
అలాగే పార్టీలో విలువలు, ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని యోగేంద్రతో కలసి మరో లేఖ రాయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. మరోవైపు పార్టీలో విభేదాలంటూ వస్తున్న కథనాలు ఊహాగానాలేనని యోగేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినందున చిన్న చిన్న విషయాలను పక్కనబెట్టి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలన్నారు. కొద్దిరోజులుగా తనకు, ప్రశాంత్ భూషణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం, కుట్ర జరుగుతోందని, ఇది చాలా బాధాకరమన్నారు.