ఆప్‌కు పోటీగా కొత్త పార్టీ!
ప్రశాంత్ భూషణ్, యోగేంద్రఏర్పాటు చేసే అవకాశం
ఈనెల 14న మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్న ప్రశాంత్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు కొత్త పార్టీ నెలకొల్పబోతున్నారా? ఇందుకు త్వరలోనే సన్నాహాలు మొదలుపెట్టనున్నారా? తాజా పరిణామాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రశాంత్ తోసిపుచ్చలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 14న తమ మద్దతుదారులతో సమావేశమవుతామని, ఈ భేటీ తర్వాత పార్టీ పెట్టాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పీటీఐ వార్తాసంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. తనను, యోగేంద్ర యాదవ్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన తీరు అత్యంత బాధకు గురిచేసిందన్నారు. కేజ్రీవాల్‌కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. కిందటేడాది నవంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ రద్దయ్యేందుకు ముందే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాల్సిందిగా ఓ సామాజిక కార్యకర్త ద్వారా రాహుల్‌గాంధీతో రాయబారాలు నడిపార ని చెప్పారు. ఇలా కాంగ్రెస్ మద్దతుకు యత్నించడం, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం, ఢిల్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల్లో కేజ్రీవాల్‌తో విభేదాలు ఏర్పడ్డాయని వివరించారు.
ఇక వారితో కలసి నడవలేను
ఆప్‌లో కొనసాగుతారా అని అడగ్గా.. కేజ్రీవాల్, ఆయన మద్దతుదారులతో కలసి ఇక నడవలేనని ప్రశాంత్ అన్నారు. ఆరోజు(మార్చి 28న జాతీయ మండలి సమావేశంలో) వారు చేసింది క్షమించరాని చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆప్ కార్యకర్తల శక్తిని సానుకూల దిశలోకి మళ్లించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సొంత ఎమ్మెల్యేలనే నమ్మని కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం ఉండేది కాదని ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ మంగళవారం విమర్శించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీల కార్యాలయాల నుంచి చేస్తున్నట్లుగా.. సొంతవ్యక్తులతో పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయించేవారని, రూ. 10 కోట్లిస్తాం.. బీజేపీకి మద్దతివ్వాలని వారితో అడిగించేవారని గార్గ్ ఆరోపించారు. తనతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు అలాంటి ఫోన్‌కాల్స్ వచ్చాయని చెప్పారు.