ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు
పార్టీ మీద తిరుగుబాటు చేసిన యోగేంద్ర యాదవ్, ప్రశాంతభూషణ్ ఇద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వాళ్లమీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలనూ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గిన కొన్నాళ్లకే పార్టీలో అసంతృప్తి బయల్దేరడం, దాంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగడం తెలిసిందే. తర్వాత యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ ఇద్దరూ కలిసి 'స్వరాజ్ అభియాన్' అనే గ్రూపును ఏర్పాటుచేశారు.
వాళ్లిద్దరినీ పార్టీలోని కీలక పదవులు, కమిటీల నుంచి ఇప్పటికే తప్పించారు. వాళ్లతోపాటు ఆనందకుమార్, అజిత్ ఝా అనే మరో ఇద్దరు సీనియర్ నేతలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమాంతర గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేశారని ప్రశాంత భూషణ్పై ఆరోపణలు మోపారు. కొత్త పార్టీ ఏర్పాటుగురించి ఏమంటారని కూడా ఆ సమావేశంలో కార్యకర్తలను అడిగినట్లు నోటీసులో పేర్కొన్నారు.