బాడీగార్డు చనిపోయినా.. పట్టించుకోని మంత్రి!
మంత్రులకు తమను రక్షించడానికి పోలీసులు కావాలి గానీ.. వాళ్ల ప్రాణాలు పోతున్నా పట్టడం లేదు. తమది సామాన్యుల పార్టీ అని చెప్పుకొనే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఇలాంటి వ్యవహారమే సాగుతోంది. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్‌లోని ఒక సెక్యూరిటీ వాహనం తిరగబడింది. అందులోని జవాన్లందరూ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు వారిలో ఒకరు చనిపోయారు కూడా. అయినా మంత్రిగారికి మాత్రం అదేమీ పట్టలేదు. ఎంచక్కా తన మానాన తాను వెళ్లిపోయారు!!
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి భానుప్రతాప్‌పూర్ వెళ్తున్నారు. సగం దారిలో ఉండగా ఆయన వెనకాల వస్తున్న పైలట్ కార్లలో ఒకదాని టైరు పేలిపోయి, వాహనం దగ్గర్లోని పొలాల్లోకి దూసుకెళ్లి, తిరగబడింది. అప్పటివరకు మంత్రిగారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో ఒకరు అక్కడికక్కడే మరణించారు కూడా. దాంతో ఎస్కార్టులో ఉన్న మరో వాహనం ఆగింది. కానీ మంత్రి కారు మాత్రం దూసుకుంటూ వెళ్లిపోయింది. తన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత.. తీరిగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాత్రం గోపాల్ రాయ్ పరామర్శించి వచ్చారు. ఆయన తీరును బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు.