మాజీ మంత్రిపై కేసు?
మాజీ మంత్రిపై కేసు?
Published Tue, Mar 11 2014 11:18 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై క్రిమినల్ కేసు నమోదు కానుంది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నివేదికను పంపారు. అప్పట్లో ఖిర్కీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో కొందరు నైజీరియా మహిళలు నివసిస్తున్న అపార్టుమెంట్‌పై అర్ధరాత్రి పూట మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆధ్వర్యంలో అతడి అనుచరులు కొందరు దాడిచేసిన విషయం తెలిసిందే. నైజీరియన్లు అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, మాదకద్రవ్యాల వ్యాపారానికి ఆ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని స్థానికులు కొందరు తనకు ఫిర్యాదు చేశారని, అందుకే అర్ధరాత్రిపూట తాను తనిఖీలు చేసినట్లు సోమ్‌నాథ్ అప్పట్లో తన చర్యను సమర్థించుకున్నారు. మొదట ఆ అపార్టుమెంట్‌లో ఉన్న మహిళలను వెంటనే అరెస్టు చేయాలని మంత్రి హోదాలో స్థానిక పోలీసులను సోమ్‌నాథ్ ఆజ్ఞాపించగా వారు తిరస్కరించారు. చట్టప్రకారం ఆ సమయంలో మహిళలను అరెస్టు చేసే అధికారం తమకు లేదని వారు సమాధానమివ్వడంతో సోమ్‌నాథ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పోలీస్, ఆప్ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైంది.
ఆ సమయంలో మంత్రి అనుచరులు సృష్టించిన వీరంగం పలు విమర్శలకు తావు తీసింది. న్యాయశాఖ మంత్రిగా సోమ్‌నాథ్ చర్యలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమర్ధిస్తూ సదరు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చిలికిచిలికి గాలివానగా మారి చివరకు ఆప్ ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..అన్నంతవరకు వెళ్లింది. ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులపై ఆప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు దిగింది. వారు రాష్ర్ట ప్రభుత్వ పరిధిలో లేకపోవడం వల్లే మంత్రుల మాట సైతం వినడంలేదని, వారు విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారని ఆప్ సర్కార్ ఆరోపించింది. అప్పట్లో ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ రైల్ భవన్ వద్ద ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. మంత్రి ఆజ్ఞ పాటించని పోలీస్ అధికారులను సస్పెండ్ చేయా లని కేజ్రీవాల్ డిమాండ్ చేయగా, వారిని సెలవుపై పంపించేందుకు ఎల్జీ అంగీకరించడంతో, ఆప్ సర్కార్ ఆందోళన విరమించింది.
కాగా, ఈ ఘటనపై అప్పట్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. ఈ మేరకు రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి బి.ఎల్.గార్జ్ నియమించారు. దీనికి సంబంధించిన నివేదికను గత నెలలో ఎల్జీకి గార్గ్ అందజేశారు. సదరు ఘటనలో పోలీసులది ఏమాత్రం తప్పు లేదని, మంత్రి అతడి అనుచరులు హైడ్రామా సృష్టించారని అందులో పేర్కొన్నారు. కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు నివేదికపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోం, న్యాయ, చట్ట శాఖలకు ఎల్జీ పంపించారు. మాజీ న్యాయమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని హోం శాఖ ప్రతిపాదించగా, ఈ ఘటనపై పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై ఇప్పటికే నమోదైన కేసులో భారతి పేరును చేర్చవచ్చా లేదా కొత్తగా కేసు పెట్టాలా అని న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరారు. ఈ విషయమై హోం శాఖ నివేదికను పరిశీలించిన తర్వాత మాజీ మంత్రిపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి కోరారు.
Advertisement