న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ప్రజలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు శనివారం పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులను అరెస్టు చేశారు. ఆప్ ఢిల్లీశాఖ కార్యదర్శి దిలీప్ పాండే, రవిశంకర్ సింగ్, సోనూ, జావెద్, రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశామని డీసీపీ పి.కరుణాకరణ్ ప్రకటించారు. పాండే పార్టీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఆప్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ తమనాయకులు, కార్యకర్తలను కేసుల్లో ఇరికించి ఇబ్బందులపాలు చేస్తోందని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వ్యూహం ఫలించలేదన్న నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ నాయకులను అరెస్టు చేయాల్సిందిగా అధికారులు కిందిస్థాయి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ట్విటర్‌లో రాశారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అంటించిన పోస్టర్ల కేసులో అరెస్టయిన ఆప్ కార్యకర్తలు పాండే పేరు చెప్పడతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జామియానగర్ పోలీసులు ఆయనను గంటల తరబడి ప్రశ్నించారని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
నిందితులపై ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టం, సమాచార, పుస్తక నమోదు చట్టం 1867 ప్రకారం కేసులు నమోదు చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఆప్ ఇలాంటి పోస్టర్లు వేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. వీరంతా ‘వర్గాన్ని వంచిస్తున్నార’ని అందులో రాశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పోస్టర్లు కనిపించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మతీన్ అహ్మద్, ఆసిఫ్ మహ్మద్ ఖాన్, హసన్ అహ్మద్ నివాసాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా ఇందులో పిలుపునిచ్చారు.
దీనికి కేజ్రీవాల్ వివరణ ఇస్తూ అమానుతుల్లా అనే వ్యక్తి పోస్టర్లు అంటించినట్టు విచారణలో అంగీకరించినా, పోలీసులు మాత్రం తమ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో గుజరాత్ సంస్కృతిని పెంచిపోషించాలని బీజేపీ కోరుకుంటోందని, ప్రత్యర్థులను అణచివేయడానికి గుజరాత్ పోలీసులు ఇలాంటి పనులే చేసేవారని ఆప్ రాజకీయ వ్యవహారాల సంఘం సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. పాండేకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలేవీ లేకున్నా అరెస్టు చేశారన్నారు. ఆప్ సీనియర్ నాయకుల పేర్లు చెప్పాల్సిందిగా తమ కార్యకర్తలను పోలీసులు బెదిరించారని ఆప్ ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఈ అరెస్టులు జరిగాయన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ
ఈ కేసులో అరెస్టయిన పాండేతోపాటు రామ్‌కుమార్ ఝా, జావెద్ అహ్మద్‌కు ఆగస్టు రెండు వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ షీతల్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. నిందితులు వేసిన పోస్టర్లు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. బెయిల్ కోసం వీళ్లు సమర్పించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రచురణ విభాగం ఇన్‌చార్జ్ పాండే, డిజైనర్ అహ్మద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి వీలుగా నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
పోస్టర్ డిజైన్ ప్రతిని అహ్మద్.. పాండే, ఝాకు పంపారని ప్రభుత్వ న్యాయవాది నిధి తెలిపారు. దీనికి ఝా స్పందిస్తూ ‘బాగుంద’ని జవాబు ఇచ్చాడని చెప్పారు. దీంతో అహ్మద్ ఆఖరు ప్రతిని వీళ్లిద్దరికీ ఈ-మెయిల్‌లో పంపించాడని వివరించారు. అహ్మద్ మెయిల్స్‌కు ఆప్ నాయకులు స్పందించలేదని, వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని వాదించారు. అహ్మద్, ఝా పొరపాటుగా మెయిల్స్‌ను పాండేకు పంపారన్నారు. పోస్టర్లను సరిగ్గా గమనించకుండానే ప్రత్యుత్తరమిచ్చారని వివరించారు. అమానుతుల్లా అనే వ్యక్తి పోస్టర్లు అంటించినట్టు విచారణలో అంగీకరించినా, పోలీసులు మాత్రం తమ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే ఇదే కేసులో అరెస్టయిన ఆప్ కార్యకర్తలు అజిత్ దూబే,ముకేశ్ ఝాకు బెయిల్ మంజూరయింది.
ఆప్‌పై మండిపడ్డ బీజేపీ, కాంగ్రెస్
పోయినపట్టును నిలుపుకోవడానికి ఆప్ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. ఢిల్లీలో మతకల్లోలాలను రెచ్చగొట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలకు తాజా అరెస్టులు ఊతమిస్తున్నాయని స్పష్టం చేశాయి. మీడియాను ఆకర్షించేందుకు ఆయన తరచూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ విమర్శించారు. తమ పార్టీ ఒత్తిడుల వల్లే అరెస్టులు జరిగాయన్న ఆరోపణలపై స్పందిస్తూ ఫొటోలు, వీడియోలు చూసిన తరువాతే పోలీసులు కేసులు నమోదు చేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ స్పందిస్తూ కేజ్రీవాల్ ‘విభజించి పాలించు’ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. బీజేపీ, ఆప్ కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాయని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ లవ్లీ స్పష్టం చేశారు.
ముదురుతున్న పోస్టర్ల వివాదం
Published Sat, Jul 19 2014 10:23 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement