ఆప్ సర్కార్ నన్ను వేధిస్తోంది: బర్ఖాసింగ్
Published Wed, Jan 29 2014 10:45 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ బర్ఖాసింగ్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీచేసినందుకే తనను వేధిస్తున్నారన్నారు. డీసీడబ్ల్యూ చైర్మన్ పదవి నుంచి తనను తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆప్ తనను వేధిస్తోందని, సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీ చేసినందుకే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనను తప్పించడం ఆప్ సర్కార్ వల్ల కాదన్నారు. తనను తప్పించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఆదేశాలు జారీ చేయాలని, తన పదవీకాలం ఇంకా 16 నెలలు ఉన్నందున ఆయన తనకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయరని భావిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగినందున ఆ ప్రభుత్వం నియమించిన బర్ఖాసింగ్ కూడా తన పదవిలోనుంచి దిగిపోవాలని ఆప్ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సింగ్ స్పందిస్తూ... ఆప్ కోరినంతమాత్రాన తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినందున సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీ చేసిన తాను డీసీడబ్ల్యూ పదవికి వందశాతం న్యాయం చేశానని, ఇది నచ్చకే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. కాగా షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారానికి దూరమైన తర్వాత డీపీసీసీ అధ్యక్షుడు లవ్లీ మాట్లాడుతూ... పార్టీ నేతలెవరైనా వివిధ బోర్డుల, కమిషన్లలో ముఖ్యమైన పదవుల్లో ఉంటే వాటికి రాజీనామా చేయాలని సూచించారు. బర్ఖాసింగ్ వ్యవహారంలో మీడియా అడిగిన ప్రశ్నకు లవ్లీ సమాధానమిస్తూ తన సూచనలను తాను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బర్ఖాసింగ్ ప్రస్తావిస్తూ.. రాజ్యాంగబద్ధమైన పదవి అయినందునే లవ్లీ కూడా తనకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు.
Advertisement
Advertisement