వివాదాల భారతి!
Published Wed, Jan 22 2014 11:48 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌లోని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. తన నియోజకవర్గం లోని ఉగాండ మహిళలపట్ల ఆయన దూకు డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోమ్‌నాథ్ రాజీనామా చేయడంతోపాటు లాయర్‌గా ఆయన లెసైన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆందోళనలకు ఇప్పుడు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, మహిళా సంఘాలు గొంతు కలిపాయి. మహిళలను అవమానపరిచేలా ప్రవర్తించడంపై వారు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్న మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. గత బుధవారం ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తన నియోజకవర్గం మాలవీయ్‌నగర్ పరిధిలోని ఓ భవనంపై దాడి చేయడం, అక్కడ నివసిస్తున్న ఇద్దరు ఉగాండా యువతులు సెక్స్, డ్రగ్ రాకెట్ నడుపుతున్నారంటూ ఆయన అనుచరులు హంగామా చేయడం తెలిసిందే. అనంతరం వారికి బలవంతంగా వైద్య పరీక్షలు చేయించినప్పుడు సైతం సోమ్‌నాథ్ ఆసుపత్రిలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు కావడం దుమారానికి కారణమవుతోంది. అయితే పోలీసులపై ఎదురుదాడికి దిగుతూ సీఎం కేజ్రీవాల్ రైలు భవన్ వద్ద అనూహ్యంగా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. విమర్శలు వెల్లువెత్తడడంతో కేజ్రీవాల్ సైతం ఎల్‌జీ హామీ ఇచ్చారంటూ వెనక్కి తగ్గారు. వాస్తవానికి కే జ్రీవాల్ ధర్నాతో సోమ్‌నాథ్ వ్యవహారం సద్దుమణుగుతుందని ఆప్ నాయకులు భావించారు.
అస్త్రంగా మార్చుకున్న ప్రతిపక్షాలు..
ఎన్నికల హామీలను వరుసగా నెరవేరుస్తూ వెళ్తున్న ఆప్ సర్కార్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన సమయంలో సోమ్‌నాథ్ వ్యవహారం అస్త్రంగా దొరికింది. మహిళల భద్రతపై, గత ప్రభుత్వాల తీరుపై వరుస నిరసనలు తెలియజేయడంతోపాటు మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించిన ఆప్ సర్కార్‌లో ఓ మంత్రి మహిళలపై అడ్డగోలు దాడులకు దిగడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆప్ మంత్రి తీరును దుయ్యబడుతూ బీజేపీ పలు ఆందోళనలు చేపట్టింది. న్యాయశాఖ మంత్రిని వెంటనే తప్పించడంతోపాటు అతడి లెసైన్స్ క్యాన్సల్ చేయాలని పట్టుబట్టాయి. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. కే జ్రీవాల్ ధర్నా విరమించడంతో ఇప్పుడు ఢిల్లీ సీఎం, మంత్రులపై రెండు పార్టీలు మూకుమ్మడి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులను రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి తేవాలంటూ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా కేవలం మంత్రులను కాపాడుకునే ప్రయత్నంగా చూపేందుకు వారు యత్నిస్తున్నారు. మరోవైపు సోమ్‌నాథ్‌పై కేసు నమోదు, మహిళా సంఘాల నుంచి నిరసనలు ఆప్‌ను మరింత ఇరుకునపెడుతున్నాయి. దీనిపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఆ పార్టీ సోమ్‌నాథ్‌ను కొనసాగించాలా.. తప్పించాలా అన్నదానిపై తర్జనభర్జనలు పడుతోంది.
Advertisement