Delhi Law Minister Somnath Bharti
-
వివాదాల భారతి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌లోని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. తన నియోజకవర్గం లోని ఉగాండ మహిళలపట్ల ఆయన దూకు డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోమ్‌నాథ్ రాజీనామా చేయడంతోపాటు లాయర్‌గా ఆయన లెసైన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆందోళనలకు ఇప్పుడు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, మహిళా సంఘాలు గొంతు కలిపాయి. మహిళలను అవమానపరిచేలా ప్రవర్తించడంపై వారు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్న మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. గత బుధవారం ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తన నియోజకవర్గం మాలవీయ్‌నగర్ పరిధిలోని ఓ భవనంపై దాడి చేయడం, అక్కడ నివసిస్తున్న ఇద్దరు ఉగాండా యువతులు సెక్స్, డ్రగ్ రాకెట్ నడుపుతున్నారంటూ ఆయన అనుచరులు హంగామా చేయడం తెలిసిందే. అనంతరం వారికి బలవంతంగా వైద్య పరీక్షలు చేయించినప్పుడు సైతం సోమ్‌నాథ్ ఆసుపత్రిలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు కావడం దుమారానికి కారణమవుతోంది. అయితే పోలీసులపై ఎదురుదాడికి దిగుతూ సీఎం కేజ్రీవాల్ రైలు భవన్ వద్ద అనూహ్యంగా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. విమర్శలు వెల్లువెత్తడడంతో కేజ్రీవాల్ సైతం ఎల్జీ హామీ ఇచ్చారంటూ వెనక్కి తగ్గారు. వాస్తవానికి కే జ్రీవాల్ ధర్నాతో సోమ్‌నాథ్ వ్యవహారం సద్దుమణుగుతుందని ఆప్ నాయకులు భావించారు. అస్త్రంగా మార్చుకున్న ప్రతిపక్షాలు.. ఎన్నికల హామీలను వరుసగా నెరవేరుస్తూ వెళ్తున్న ఆప్ సర్కార్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన సమయంలో సోమ్‌నాథ్ వ్యవహారం అస్త్రంగా దొరికింది. మహిళల భద్రతపై, గత ప్రభుత్వాల తీరుపై వరుస నిరసనలు తెలియజేయడంతోపాటు మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించిన ఆప్ సర్కార్‌లో ఓ మంత్రి మహిళలపై అడ్డగోలు దాడులకు దిగడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆప్ మంత్రి తీరును దుయ్యబడుతూ బీజేపీ పలు ఆందోళనలు చేపట్టింది. న్యాయశాఖ మంత్రిని వెంటనే తప్పించడంతోపాటు అతడి లెసైన్స్ క్యాన్సల్ చేయాలని పట్టుబట్టాయి. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. కే జ్రీవాల్ ధర్నా విరమించడంతో ఇప్పుడు ఢిల్లీ సీఎం, మంత్రులపై రెండు పార్టీలు మూకుమ్మడి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులను రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి తేవాలంటూ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా కేవలం మంత్రులను కాపాడుకునే ప్రయత్నంగా చూపేందుకు వారు యత్నిస్తున్నారు. మరోవైపు సోమ్నాథ్పై కేసు నమోదు, మహిళా సంఘాల నుంచి నిరసనలు ఆప్‌ను మరింత ఇరుకునపెడుతున్నాయి. దీనిపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఆ పార్టీ సోమ్‌నాథ్‌ను కొనసాగించాలా.. తప్పించాలా అన్నదానిపై తర్జనభర్జనలు పడుతోంది. -
రేప్ బాధితురాలి పేరు వెల్లడించిన మంత్రి
న్యూఢిల్లీ: అత్యాచార బాధితుల వివరాలు వెల్లడించకూడదన్న నియమాన్ని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి ఉల్లంఘించారు. తర్వాత పొరపాటును ఆయన సరిదిద్దుకున్నారు. డెన్మార్క్ మహిళపై మంగవారం రాత్రి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బుధవారం రాత్రి సోమనాథ్ భారతి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో బాధితురాలి పేరు పేర్కొనడంతో కలకలం రేగింది. బాధితురాలి పేరు తొలగించాలని ఢిల్లీ పోలీసులు, డెన్మార్క్ కాన్సులేట్ కోరడంతో ఆయన పొరపాటు గ్రహించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, పొరపాటున జరిగిందని వివరణయిచ్చారు. ఆమె పేరు తొలగించి మరోసారి ప్రకటన విడుదల చేశారు. భారత్ చూసేందుకు వచ్చిన 51ఏళ్ల డానిష్ మహిళపై కొందరు ఆకతాయిలు మంగళవారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. -
‘లా’లో లొల్లి..
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయవ్యవస్థలో ముసలం మొదలైంది. న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఢిల్లీ కోర్టుల న్యాయమూర్తులను సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆదేశించడం వివాదానికి దారితీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భర్తీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి ఎ.ఎస్. యాదవ్ తోసిపుచ్చారని తెలిసింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ గురించి వేరే ఎవ్వరూ మాట్లాడకూడదని, ఏమైనా ఉంటే హైకోర్టుకు నివేదించుకోవాలని సూచించినట్లు తెలిసింది. దాంతో తన ఆదేశాలను తప్పనిసరిగా ఆచరించాల్సిందేనని మంత్రి భర్తీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. న్యాయమూర్తుల సమావేశంపై తాను యాదవ్‌పై ఒత్తిడి చేయడంలేదని పేర్కొన్నారు. తీర్పులు ఇచ్చే విధానంలో మరింత పరిపక్వత కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయమని కోరానే తప్ప మరే ఇతర కారణాలు లేవని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా యాదవ్ ఢిల్లీ ప్రభుత్వ శాఖకు డిప్యుటేషన్‌పై రాక ముందు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోతానని ఇటీవలనే ప్రభుత్వాన్ని కోరారు. కాగా, స్వతంత్ర అధికారాలు కలిగిన న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎవరూ కల్పించుకోవాల్సిన అవసరంలేదని యాదవ్ వాదిస్తున్నారు. న్యాయవిధానాన్ని సులభతరం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించడానికి ఏం చేయాలో.. అన్ని చర్యలు తీసుకుంటున్నామని సోమనాథ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై మాట్లాడటానికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో సమయం కోరానన్నారు. తాను న్యాయశాఖ కార్యదర్శిపై ఒత్తిడి చేస్తున్నానడం అవాస్తవం అన్నారు. కాగా, ఇప్పటివరకు తమకు న్యాయమూర్తుల సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యాదవ్ ఈ నెల రెండో తేదీన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయినట్లు సమాచారం.