‘లా’లో లొల్లి..
Published Tue, Jan 7 2014 10:53 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయవ్యవస్థలో ముసలం మొదలైంది. న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఢిల్లీ కోర్టుల న్యాయమూర్తులను సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆదేశించడం వివాదానికి దారితీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భర్తీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి ఎ.ఎస్. యాదవ్ తోసిపుచ్చారని తెలిసింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ గురించి వేరే ఎవ్వరూ మాట్లాడకూడదని, ఏమైనా ఉంటే హైకోర్టుకు నివేదించుకోవాలని సూచించినట్లు తెలిసింది. దాంతో తన ఆదేశాలను తప్పనిసరిగా ఆచరించాల్సిందేనని మంత్రి భర్తీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయమై మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. న్యాయమూర్తుల సమావేశంపై తాను యాదవ్‌పై ఒత్తిడి చేయడంలేదని పేర్కొన్నారు. తీర్పులు ఇచ్చే విధానంలో మరింత పరిపక్వత కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయమని కోరానే తప్ప మరే ఇతర కారణాలు లేవని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా యాదవ్ ఢిల్లీ ప్రభుత్వ శాఖకు డిప్యుటేషన్‌పై రాక ముందు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోతానని ఇటీవలనే ప్రభుత్వాన్ని కోరారు. కాగా, స్వతంత్ర అధికారాలు కలిగిన న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎవరూ కల్పించుకోవాల్సిన అవసరంలేదని యాదవ్ వాదిస్తున్నారు.
న్యాయవిధానాన్ని సులభతరం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించడానికి ఏం చేయాలో.. అన్ని చర్యలు తీసుకుంటున్నామని సోమనాథ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై మాట్లాడటానికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో సమయం కోరానన్నారు. తాను న్యాయశాఖ కార్యదర్శిపై ఒత్తిడి చేస్తున్నానడం అవాస్తవం అన్నారు. కాగా, ఇప్పటివరకు తమకు న్యాయమూర్తుల సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యాదవ్ ఈ నెల రెండో తేదీన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయినట్లు సమాచారం.
Advertisement