కేంద్ర, రాష్ట్రాలపై హైకోర్టు ఆగ్రహం
వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ
ఎస్‌ఐటీలో మైనారీలకు చోటు కల్పించాలి
గుడులు, మసీదులపై కూడా దాడులు: అనిల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల చర్చిలపై జరిగిన దాడులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ బుధవారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎస్‌ఐటీ)లో మైనారిటీ వ ర్గానికి చెందిన వారికి లేదా జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్రానికి సూచించింది.
చర్చిలమీద జరిగిన దాడులపై ఎస్‌ఐటీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులకు సంబంధిత అధికారులు 4 వారాల్లో సమాధానమివ్వాలని ధర్మాసనం ఆదేశించింది. కేసుపై విచారణను జులై 1కి వాయిదా వేసింది. చర్చిలమీద దాడులకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో దాడులు జరుగకుండా భద్రత కల్పించేందుకు చేపట్టిన చర్యలపై.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల స్థాయీ నివేదికను కోరుతూ రీగన్ ఎస్ బెల్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు.
పిటిషన్‌ను కొట్టివేయాలి: అనిల్ సోని
ధర్మాసనం ఎదుట హోం మంత్రిత్వ శాఖ తరఫున వాదించిన కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ అనిల్ సోనీ ఈ పిల్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది మతతత్వ పిటిషన్ అని ఆయన వాదించారు. చర్చిలమీద జరిగిన దాడులపై దర్యాప్తు జరపడం కోసం ఎస్‌ఐటీని నియమించినట్లు ధర్మాసనానికి చెప్పారు. మతంతో సంబంధంలేకుండా అన్ని ధార్మిక స్థలాలను రక్షించవలసి ఉండగా పిటిషన్ కేవలం చర్చిల గురించే ఎందుకు పట్టించుకుంటోంద ని ప్రశ్నించారు.
గుడులు, గురుద్వారాాలు, మసీదులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన కోర్టు దష్టికి తెచ్చారు. వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. పిటిషనర్ కూడా అన్ని మతాల గురించి ఆలోచించాల్సిందని వాదించారు. ఢిల్లీలో గతేడాది ఆరు చర్చిలతో పాటు దాదాపు 200 గుళ్లు, 30 గురుద్వారాలు, 14 మసీదుల్లో విధ్వంసం జరిగిందని వివరించారు. కేవలం ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. అన్ని మతాలను సమానంగా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
పవిత్ర స్థలాలన్నిటికీ రక్షణ కల్పించాలి
సోనీ వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. చర్చిలతో పాటు గురుద్వారాలు, గడులు, మసీదులు.. అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు సమాన రక్షణ కల్పించాలని అభిప్రాయపడింది. ‘ఇలాంటి దాడులకు సంబంధించి ఏవైనా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయా’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా జారీ చేసింది.
చర్చిలపై దాడులను నివారించలేరా?
Published Thu, Apr 30 2015 1:08 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement