ఓటర్ల జాబితాలో తప్పులున్న మాట నిజమే | Delhi polls: Chief Electoral Officer admits mistakes in voters' list | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాలో తప్పులున్న మాట నిజమే

Published Mon, Jan 12 2015 11:20 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Delhi polls: Chief Electoral Officer admits mistakes in voters' list

 న్యూఢిల్లీ: వచ్చే నెల ఏడో తేదీన జరగనున న ఎన్నికలకు సంబంధించి తాము విడుదల చేసిన ఓటర్ల జాబితాలో తప్పులున్న మాట నిజమేననే విషయాన్ని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి... సోమవారం హైకోర్టులో అంగీకరించారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లు ఉన్నారంటూ దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు రాగా తప్పులను సరిదిద్దుకుంటున్నామంటూ ఎన్నికల ప్యానల్ జవాబిచ్చింది. ఇందుకు కారకులెవరనే విషయమై ఆరా తీస్తున్నట్టు తెలియజేసింది. ‘ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని సవరించాం. ఆయా పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేసే వరకూ సవరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
 
 తప్పు ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నాం. తప్పు చేసిన వారు దొరికితే చట్టం ప్రకారం శిక్షిస్తాం’అని తెలియజేశారు. అడ్వొకేట్ ఓపీ సక్సేనా దాఖలుచేసిన ఈ పిటిషన్ జస్టిస్ విభూ భక్రూ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 13వ తేదీవరకూ వాయిదా వేయాలంటూ సక్సేనా దాఖలుచేసిన మధ్యంతర వ్యాజ్యాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికల ప్రక్రియను తాము ఆపివేయలేమని న్యాయమూర్తి చెప్పారు. అందుకు ఎన్నికల ప్యానల్ జవాబిస్తూ బోగస్ ఓటర్ల జాబితాకు సంబంధించి నివేదికలను సమర్పించాలంటూ అన్ని జిల్లాలకు చెందిన రిటర్నింగ్ అధికారులను ఆదేశించామని వివరించారు. ఓటర్ల పేర్లను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసేందుకు యత్నిస్తున్నామన్నారు.
 
 ఈవిధంగా చేయడం వల్ల తప్పలు తక్కువగా దొర్లే అవకాశముంటుందన్నారు. ఇందుకు సక్సేనా స్పందిస్తూ ఈ నెల ఐదో తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ తప్పులు ఉన్నాయని, సవరిస్తున్నామంటూ పోల్ ప్యానల్ చెప్పిందని, అయినప్పటికీ ఒక్క ముండ్కా నియోజక వర్గంలోనే దాదాపు పది వేల నుంచి 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. ఇంత పెద్దసంఖ్యలో బోగస్ ఓట్లు ఉంటే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్నారు. అంతేకాకుండా బోగస్ ఓటర్లను జాబితాలో చేర్చినవారు అనూహ్యమైన లబ్ధి పొందుతారన్నారు. కాగా సక్సేనా పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరగనుంది. 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో పిటిషన్‌దారుడు నగరంలోని ముండ్కా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement