Minister Gopal Rai
-
బాడీగార్డు చనిపోయినా.. పట్టించుకోని మంత్రి!
మంత్రులకు తమను రక్షించడానికి పోలీసులు కావాలి గానీ.. వాళ్ల ప్రాణాలు పోతున్నా పట్టడం లేదు. తమది సామాన్యుల పార్టీ అని చెప్పుకొనే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఇలాంటి వ్యవహారమే సాగుతోంది. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్‌లోని ఒక సెక్యూరిటీ వాహనం తిరగబడింది. అందులోని జవాన్లందరూ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు వారిలో ఒకరు చనిపోయారు కూడా. అయినా మంత్రిగారికి మాత్రం అదేమీ పట్టలేదు. ఎంచక్కా తన మానాన తాను వెళ్లిపోయారు!! ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి భానుప్రతాప్‌పూర్ వెళ్తున్నారు. సగం దారిలో ఉండగా ఆయన వెనకాల వస్తున్న పైలట్ కార్లలో ఒకదాని టైరు పేలిపోయి, వాహనం దగ్గర్లోని పొలాల్లోకి దూసుకెళ్లి, తిరగబడింది. అప్పటివరకు మంత్రిగారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో ఒకరు అక్కడికక్కడే మరణించారు కూడా. దాంతో ఎస్కార్టులో ఉన్న మరో వాహనం ఆగింది. కానీ మంత్రి కారు మాత్రం దూసుకుంటూ వెళ్లిపోయింది. తన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత.. తీరిగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాత్రం గోపాల్ రాయ్ పరామర్శించి వచ్చారు. ఆయన తీరును బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. -
ఇక రెట్టింపు బస్సులు నడుపుతాం
న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములా వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బస్సు సేవలను దాదాపు రెట్టింపు చేశారు. జనవరి 1 నుంచి సరి-బేసి విధానం అమలు చేస్తున్నందున అదే రోజు నుంచి ప్రస్తుతం ఉన్న బస్సు సేవలను రెట్టింపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 వేల అదనపు బస్సులు ఢిల్లీ నగరంలో జనవరి 1 నుంచి రోడ్డెక్కుతాయని గురువారం రవాణాశాక మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జనవరి 1-15 తేదీల మధ్య ఈ బస్సు సేవల్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. అధిక సేవల కోసం స్కూలు బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీఎన్జీ స్కూలు బస్సుల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రూపకల్పణ చేసిన 'పుచో ఆప్'ను ఈ నెల 25న డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆటో సేవలను రెట్టింపు చేయనున్నట్లు, ఒకే ఆటోను రెండు డ్రైవర్లు ఒక్కో షిఫ్ట్ చొప్పున నడుపుతారని మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. లోకల్ ట్రైన్ సర్వీసులు పొడిగించే దిశగా చర్చలు సాగిస్తున్నట్లు వివరించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని అధికారులు ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం విదితమే.