పాటే నా ప్రాణం: కె.ఎస్.చిత్ర
చిట్‌చాట్: పద్మశ్రీ డాక్టర్ కె.ఎస్.చిత్ర.. పరిచయం అక్కరలేని సింగర్. శుక్రవారం ఆమె హైదరాబాద్‌కు విచ్చేశారు. ‘సిటీప్లస్’తో కాసేపు ముచ్చటించారు. విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘కేరళలోని తిరువనంతపురంలో 1963లో జన్మించాను. 1979లో ఎంజీ రాధాక్రిష్ణన్ నేతృత్వంలోని మలయాళ చిత్రం ‘అట్టహాసం’తో రంగప్రవేశం చేశాను. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. మలయాళం, తెలుగు, అస్సామీ, కన్నడ, ఒరియా, బెంగాలి, పంజాబీ, బడగ తదితర పది భాషల్లో పాడాను. దేశవిదేశాల్లో ఎన్నో సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా అవార్డులు పొందాను. 2005లో పద్మశ్రీ అవార్డు వచ్చింది.
సాధనతో ఇదంతా సాధ్యమైంది. శ్రోతలను మెప్పించాను. లిటిల్ నైటింగేల్‌గా పేరొందాను. పాటకే నా జీవితం అంకితం. హైదరాబాద్‌కు చాలా కాలంగా వస్తున్నా. ఈ నగరంతో నాది విడదీయలేని అనుబంధం. ఆప్యాయతానురాగాలకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. ఆనందకరమైన వాతావరణం. వెలకట్టలేని తెలుగువారి అభిమానం నన్నెంతగానో మురిపిస్తాయి. రెండు రోజుల పర్యటన కోసం ఈసారి సిటీకి వచ్చా. శనివారం సాయంత్రం 6.30 గంటలకు శిల్పకళావేదికలో సంగీతవిభావరిలో పాల్గొంటున్నా. ఆదివారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో ‘త్రిశక్తి’ భక్తి ఆల్బమ్‌ను ఆవిష్కరించబోతున్నా..’
- కోన సుధాకర్‌రెడ్డి