ఆర్గానిక్ స్వీట్స్
తీపి... శుభారంభానికి ప్రతీక. ఆ శుభారంభం ఆరోగ్యవంతమైనదిగా ఉండాలనుకుంటున్నారు హైదరాబాదీలు. ధర కొంచెం ఎక్కువైనా పర్లేదు.. రసాయనాలు, పురుగులమందుల అవశేషాలు లేని ప్యూర్ స్వీట్స్‌కే మా ప్రయారిటీ అంటున్నారు. అందుకే ఆర్గానిక్ స్వీట్స్‌కి డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే నగరంలో ఆర్గానిక్ స్వీట్ షాప్స్ వెలుస్తున్నాయి.
- కోన సుధాకర్‌రెడ్డి
కూరగాయలే కాదు... స్వీట్స్ కూడా ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నారు హైదరాబాదీలు. అందుకే ఇలాంటి స్వీట్స్ అందించేందుకు కొత్తగా పుట్టుకొస్తున్నాయి సరికొత్త షాపులు.
150కి పైగా..
150 నుంచి 200 రకాల మిఠాయిలు ఆయా ఆర్గానిక్ స్వీట్ షాపుల్లో దొరుకుతాయి. గోందు కతేరం పానీయం, సబ్జ, మజ్జిగ, బాదంపాలు, మోతీచూర్ లడ్డు, కాజు కతిలి, వైట్ కలాకండ్, రస్‌మలైతో పాటు, బెల్లం, ఆర్గానిక్ నూనెలతో ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి.
అన్నీ ప్రత్యేకమే...
కతేరా గోందు చెట్టుకు సంబంధించిన బంకను వేడి నీటిలో మరిగిస్తే జెల్ వస్తుంది. మరిగించిన సుగంధపాల వేర్ల రసాన్ని ఇందులో కలిపితే గోందు కతేరం పానీయం తయారవుతుంది. ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇక ఒక రకమైన తులసి విత్తనాలు బెల్లం నీళ్లల్లో నానబెట్టి సబ్జ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. శెనగ పిండి , రసాయనాలు లేని బెల్లంతో మోతి చూర్ లడ్డూ చేస్తారు. బాదం ఉడికించి పొట్టు తీసి, వేడి పాలల్లో కలిపి బాదంపాలు చేస్తారు.
నేచురల్ కలర్స్..
కెమికల్స్‌తో తయారు చేసిన పర్మినెంట్ కలర్స్‌కు చోటు లేదిక్కడ. కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వుతో కేసరి కలర్ తయారు చేస్తుంటారు. అలాగే మిగతా రంగులు కూడా. మిఠాయిలపై ఉపయోగించే వెండి అద్దకం ఉండదు. ప్రకృతి వ్యవసాయ
పద్ధతుల్లో సాగైన పిండి పదార్థాలనే స్వీట్లల్లో వినియోగిస్తారు. కాగితంతో తయారు చేసిన క్యారీ బ్యాగులు, ఆకు దొన్నె కవర్లు మాత్రమే వాడతారు.
సుభాష్ పాలేకర్ పద్ధతిలో..
ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్ పాలేకర్ సూచించిన పద్ధతిలో తయారు చేసిన బెల్లాన్ని మాత్రమే ఈ స్వీట్స్‌లో వాడతారు. గానుగ ద్వారా తీసిన పప్పు, నువ్వులు, కొబ్బరి నూనె తోనే స్వీట్స్ తయారు చేస్తారు.
కనిపించేవన్నీ మంచివి కావు...
కంటికి మంచిగా కనపడే స్వీట్స్ కొనే పద్ధతి నుంచి ప్రజలు బయటపడాలి. సిటీలో ఆర్గానిక్ స్వీట్ షాపులు చాలా ఉన్నాయి. అయితే అందరికంటే ముందే 1999లో మేము ఆర్గానిక్ స్వీట్ షాపు ప్రారంభించాము. 15 ఎకరాల్లో 60 దేశీయ ఆవులతో సౌభాగ్య గో సదన్ ఏర్పాటు చేశాం. మిఠాయిలకు అవసరమయ్యే పదార్థాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ పండిస్తాం. వినియోగదారుల అభిరుచిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఆర్గానిక్ స్వీట్స్‌దే హవా!
- విజయరాం, ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఓనర్