అలలపై నడుస్తా
‘నాకు గానీ ఒక అవకాశం గానీ ఇస్తే.. హుస్సేన్‌సాగర్ అలలపై నడిచి చూపిస్తా..’ అంటున్నారు ప్రపంచ మాయలోడు పీసీ సర్కార్. ఒక్క ఈలతో కళ్లముందున్నవి కనిపించకుండా చేసే మాయావి ఆయన. అబ్రకదబ్ర అని మంత్రదండం తిప్పారో.. అద్భుతాలు జరిగిపోతాయి. మాయాలేదు, మర్మం లేదు అంటూనే కనికట్టుతో ఓ పట్టుపడతారు. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యల్లో ఆరితేరిన ఈ మాయలోడు హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో షో ఇవ్వడానికి వచ్చిన ఆయన సిటీప్లస్‌తో ముచ్చటించారు.
- కోన సుధాకర్‌రెడ్డి
మేజిక్‌కు కులగోత్రాలు లేవు. ఎనిమిదేళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ అందరికీ ఇది ఆనందం పంచుతుంది. మా తాత పీసీ సర్కార్ వారసత్వంగా ఇంద్రజాలం నాకు లభించింది. పీసీ సర్కార్ వంశంలో నాది మూడో జనరేషన్. దీన్నో గొప్ప వరంగా భావిస్తున్నాను. మేజిక్ అంటే నాకు ఆసక్తి మాత్రమే కాదు, నా జీవితం. నాకు అబ్బిన విద్య ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాను.
అనుమతిస్తే.. అద్భుతాలే..1999, 2009, 2010 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు వచ్చాను. 2009లో ఒకే నెలలో 42 ప్రదర్శనలిచ్చి రికార్డు సృష్టించా. ఈసారీ ఈ సిటీలో రికార్డు సాధించాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం అనుమతిస్తే హుస్సేన్‌సాగర్ నీటిపై నడిచి చూపిస్తా. నెక్లెస్ రోడ్డులో కళ్లకు గంతలు కట్టుకుని ఓపెన్ టాప్ జీప్ నడిపిస్తా. అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం.
ఇంకా కొంచెం..
మా తాత పీసీ సర్కార్ 101వ జయంతి ఉత్సవంగా హరిహరకళాభవన్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్నాను. ఇందులో ట్రెడిషనల్ ఐటమ్స్‌తో పాటు నా తరహా ప్రదర్శనలు కూడా ఉంటాయి. వ్యానిషింగ్ యాక్ట్ (మనిషి మాయం చేయడం) కూడా ఉంటుంది. స్టేజ్ నుంచి మాయం కావడం, వెంటనే బాల్కనీ నుంచి హాయ్ అంటూ ముందుకు రావడం ఇలాంటి మేజిక్స్ ఎన్నో ఉంటాయి. ప్రదర్శనకు వస్తే మీకే తెలుస్తాయి.
సహకరించాలి..
మేజిక్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చాలామంది వసతులు లేక ఈ విద్య నేర్చుకోలేకపోతున్నారు. 1935 లోనే పీసీ సర్కార్ కోల్‌కతాలో మ్యాజిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సిటీల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అందుకు స్థానిక మెజీషియన్స్ ముందుకు రావాలి. అంతేకాదు ప్రభుత్వం కూడా స్థలం, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెన్నైలో కొంతమంది మేజీషియన్స్ సహకారంతో ఓ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్‌లో ప్రదర్శనల ఏర్పాటుకు ఇక్కడి ప్రియ కల్చరల్ అకాడమీ మాకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.
చప్పట్లే అవార్డులు..
దేశవ్యాప్తంగా వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చాను. యురోపియన్, ఆఫ్రికా దేశాలు, అమెరికా, కెనడా, సౌత్‌ఆఫ్రి కా, జపాన్ ఇలా ఎన్నో దేశాలు తిరిగాను. ప్రజలను ఆనందపర్చడమే మా పని. వారి చప్పట్లే మాకు అవార్డులు, రివార్డులు. హైదరాబాద్‌లో ఈ నెల 24 నుంచి జనవరి 8 వరకూ ప్రదర్శనలు ఇస్తున్నాను. సిటీవాసులకు సరికొత్త వినోదం అందిస్తాననే నమ్మకం ఉంది.
నేటి నుంచే ఇంద్రజాల ప్రదర్శన
పీసీ సర్కార్ (యంగ్ అండ్ మాస్టర్)
ప్రదర్శన తేదీలు: 24 డిసెంబర్,
2014 నుంచి 8 జనవరి, 2015 వరకు
ప్రదర్శన వేళలు: రోజూ రాత్రి 7 గంటలకు..
శని, ఆదివారాలు: సాయంత్రం 4, రాత్రి 7 గంటలకు
వేదిక: హరిహర కళాభవన్, సికింద్రాబాద్.
ఆన్‌లైన్ బుకింగ్: bookmyshow
వివరాలకు ఫోన్: 97006 66061