గానమే ప్రాణం
కొంమండూరి రామాచారి... వర్ధమాన సంగీతంలో తరచుగా వినిపించే పేరు. ఈ పేరు వినగానే కొందరికి ప్రభావశీలి అయిన పాటల మాంత్రికుడుగా గుర్తుకొస్తే... మరికొందరికి క్రమశిక్షణతో సంగీతం నేర్పే గురువుగా స్ఫురిస్తారు. తనకి పాటలు నేర్పిన గురువులకు నిఖార్సయిన శిష్యుడిగా... తన దగ్గర సంగీత సాధన చేస్తున్న వారికి ఆదర్శప్రాయుడైన గురువుగా... గానమే ప్రాణంగా జీవిస్తున్న పాటల మాంత్రికుడి పరిచయం.
కోన సుధాకర్‌రె డ్డి
మెదక్ జిల్లా
‘పెదగొట్టిముక్కల’లో
కొమండూరి కృష్ణమాచార్యులు, యశోదమ్మ దంపతులకు జన్మించారు రామాచారి. బాల్యం అంతా జన్మస్థలం సమీపంలోని శివంపేట్‌లోనే. పదో తరగతి వరకు అక్కడే చదివి ఇంటర్ కోసం 1980లో సికింద్రాబాద్‌లో ప్రభుత్వ సంగీత కళాశాలకు వచ్చిన ఆయన ఏనాడూ వెనుదిరిగి చూడలేదు.
తొలి మలుపు...
అప్పుడప్పుడే పాటలు పాడటం ప్రారంభించిన తనకు బాలవినోదం కార్యక్రమం కలిసి వచ్చింది. పీవీ సాయిబాబా దగ్గర లలితసంగీతం నేర్చుకొన్నారు. రేడియోతోపాటు.. హిం దీ, తెలుగు, లలిత గీతాలు పాడటం ప్రారంభిం చారు. గొంతు బాగుందని ప్రోత్సహించడంతో స్నేహితులతో కలిసి మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లో పాటలు పాడటంతో మంచి గుర్తింపు వచ్చింది.
1998లో...
1998లో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీ ఏర్పాటు చేసి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారాయన. వీకెండ్స్‌లో రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు తమ పిల్లలను శిక్షణ కోసం తీసుకొస్తారు. ఒకసారి పిల్లల కంఠం వింటే పాటల్లో వారి భవిష్యత్ ఏంటో ఇట్టే చెప్పేయగల దిట్ట. ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న కుర్రకారు సాకేత్, ప్రణవి, గీతామాధురి, కారుణ్య, హేమచంద్ర. నాగసాహితీ, దీపు, ఇర్ఫాన్, రేవంత్‌లు రామాచారి శిష్యులే. టీవీ ఛానల్స్ రియాల్టీషోస్‌లో పాల్గొనే వారిలో అధిక శాతం వీరి శిష్యులే. సంగీతం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు పెద్ద పీఠ వేస్తారు. సంగీతంతో సమానంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు.
వేసవిలో అంతర్జాతీయ శిక్షణ..
విదేశాల్లో సైతం రామాచారికి వేలాది మంది శిష్యులు ఉన్నారు. ఒక్క అమెరికానే కాదు లండన్, అస్ట్రేలియాతో పాటు చాలా దేశాల్లో పాఠశాలల వేసవి సెలవుల సమయంలో అక్కడికి వెళ్లి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయంగా వేల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన, వందలాది అవార్డులు సొంతం చేసుకొన్నాడు. పూల వాసన దారానికి కూడా అబ్బుతుందన్న ట్లు.. ఇంటిల్లిపాది సంగీతాన్ని వంటబట్టిం చుకొన్నారు. రామాచారి వారసుడు సాకేత్ ఇప్పటికే ప్లే బ్యాక్ సింగర్‌గా దూసుకుపోతున్నాడు. కుమార్తె సాహితీ కూడా పాటలు పాడుతుంది.
సెల్యూట్ చేయాల్సిందే...
సంగీతం వ్యాప్తికి ఇక్కడి మీడియా చేస్తున్న కృషికి సెల్యూట్ చేయకతప్పదు. మీడియానే చొరవ తీసుకోకుండా ఉండి ఉంటే సంగీతం వెనకబడేది. బయటికి వెళ్తే హితులు, సన్నిహతులు, విదేశాల్లోని వారు కూడా మీ ఆధ్వర్యంలో ఒక సంగీత కళాశాల ప్రారంభించమని కోరుతున్నారు. అంతర్జాతీయ సంగీత రెసిడెన్సియల్ కళాశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కొంత నిధులు సమకూర్చుకొన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థల సహయం చేస్తే సంగీత కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తా.