సేవే వ్యసనం
కాలేజీ.. పుస్తకాలు.. చదువు.. ఆటలూ.. పాటలు.. అంతేనా! ఇంకేమీ లేదా.. అని అనుకున్నారు ఆ స్టూడెంట్స్. ఫ్రెండ్స్.. జల్సాలు.. సినిమాలు.. షికార్లు.. ఇంతేనా! అని వారికి వారు ప్రశ్నించుకున్నారు. ఒక్కరా, ఇద్దరా.. ఇరవై మంది.. ఒక్కటయ్యారు. అద్భుతమైన ఆలోచనలకు రూపమిచ్చారు. సామాజిక సేవకు నడుంబిగించారు. సేవే వారి తోవ. ఆ వూర్గంలో పుట్టిందే ‘అడిక్షన్ ద స్టూడియో’.
త్రినాథ్, సాహిత్య సాగర్... ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. ఐదేళ్ల క్రితం కలిశారు. త్రినాథ్ ఐదు సినిమాల్లో నటించాడు. సాహిత్య సాగర్ పది సినిమాలకు పాటలు, మాటలు రాశాడు. సేవాదృక్పథం కలిగిన వారి కోసం సోషల్ నెట్‌వర్క్‌లో వెతకగా ఇరవై మంది విద్యార్థులు, యువకులు తారసపడ్డారు. అందరూ కలిసి ఐదేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఓటర్ల జాగృతం
దేశంలోని మహానగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్ మీద వీరు దృష్టి పెట్టారు. ఓటర్లను జాగృతం చేయాలనుకున్నారు. సాహిత్య సాగర్... ‘మళ్లీ వచ్చింది అవకాశం.. గొప్ప మార్పు తెచ్చేటి అవకాశం.. మన కోసం’ అంటూ ఐదు నిమిషాల పాట రాశాడు. దానికి త్రినాథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియావారు దాన్ని ఇటీవలి ఎన్నికల ముందు విపరీతంగా టెలికాస్ట్ చేశారు.
పాటతో పాటు వీరు నటించిన విజువల్స్ ఓటర్లను హత్తుకున్నాయి. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అదే... ‘ఎడిక్షన్ ద స్టూడియో’. ధర్మో రక్షతి రక్షితః పేరుతో నిజాంపేట్‌లో వరలక్ష్మీవ్రతం, మహాలక్ష్మీ యాగ సహిత సుదర్శన హోమం నిర్వహించారు. మలేసియా టౌన్‌షిప్ సమీపంలోని చైతన్య రెస్టారెంట్‌వారు.. వీరి కార్యక్రమాల్లో ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. ‘చదుకున్నవారు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నవారు. అడిక్షన్ ద స్టూడియో. పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సేవ ద్వారా మంచి నడవడికకు అవకాశం ఉంటుంది. అందుకే మేం సపోర్ట్ చేస్తున్నాం’ అంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు కె.రామకృష్ణ,
ఎస్.యుగంధర్.
- కోన సుధాకర్ రెడ్డి
ఎనర్జిటిక్‌గా ఆలోచించాలి
సోషల్ నెట్ వర్క్‌లో కలిశాం. అడిక్షన్ ద స్టూడియో అభిప్రాయాలు తెలిసిన తర్వాత సపోర్ట్ చేయాలనిపించింది. అందులో మెంబరై ముందుకు సాగుతున్నా. మనుషులకు ఆత్మశుద్ధి.. సేవాతత్పరత ఉండాలి. అందుకే సేవలో నిమగ్నమయ్యాను.
- సింధూరి కులక ర్ణి, ఎమ్మెస్సీ, సైకాలజీ ఫైనలియర్
యూత్ కలసి రావాలి
సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కలసి రావాలి. ఇది ఆరంభమే. సేవలో పునీతులు కావాలి. కలసి వచ్చేవారు inboxaddiction@gmail.com, లేదంటే 90599 99144, 99599 73999 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
- సాహిత్య సాగర్, త్రినాథ్