ప్రాణ స్నేహితులను చిదిమిన సిటీ బస్సు
పట్నంబజారు (గుంటూరు): నిత్యం సరదా కబుర్లు..తియ్యని పలకరింపులు..భేషజాలు లేని బంధం వారి స్నేహం.. కళాశాలకు వెళ్లి వస్తే..రూమంతా అల్లరే...అల్లరి..అయితే ఒక్క సారిగా..కటిక చేదు మాట..ఆ స్నేహితుల మనస్సులను కలచి వేసింది...ఉదయం 6.30 నిమిషాలు...అరే ఇప్పుడే వస్తానని...చెప్పి వెళ్లిన స్నేహితుడు..కేవలం గంట వ్యవధిలో..రూంలో ఉన్న విద్యార్థులకు మరో స్నేహితుడి ఫోన్...అరే మనవాళ్లకు యాక్సిడెంట్ అయిందని..ఇప్పుడే వస్తానన్న స్నేహితుడు ఇక రాడని తెలిసి..ఆ స్నేహితుల కంటనీరు ఆగలేదు. తల్లితండ్రులు వారి బిడ్డలను చూసేందుకు వచ్చే వరకు...అన్ని పనులు వదిలిపెట్టి..పెద్దల్లా నిలిచారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..ప్రమాదంలో ఒక్కగానొక్కడు..చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్నేహానికి మరో పేరు మేమన్నట్లు కలిసి తిరుగుతున్న ఈ ప్రాణస్నేహితులు ఇద్దరిని చూసి విధికి కన్నుకుట్టింది.. చక్కటి స్నేహాన్ని సిటీ బస్సు చక్రాల కింద నుజ్జునుజ్జు చేసింది..కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన వడ్ల శ్రీనివాస చక్రవర్తి ఆచారి (చక్రి)(19), శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన బీన ప్రణీత్(19) ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుతున్నారు. మొదటి నుంచి మంచి స్నేహితులు. ఏదీ చేసినా..కలిసి చేసేవాళ్లని సాటి స్నేహితులు చెబుతున్నారు.
ఇద్దరూ..వారసులే.....
మృత్యువాత పడ్డ చక్రి, ప్రణీత్‌లు ఇద్దరూ...ఆ ఇంటికి ఒక్కరే మగబిడ్డలు. వారసులను కోల్పోయని తెలుసుకున్న కన్నపేగు..సొమ్మసిల్లిపోయింది. చక్రి తండ్రి సుబ్రమణ్యఆచారి ఆళ్ళగడ్డలో బొమ్మలు చెక్కే శిల్పి. మధ్య తరగతి కుటుంబం అయినా...బిడ్డను బాగా చదివించాలనుకున్నారు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు బస్సు చక్రాల కింద పడి మృత్యుఒడిలోకి వెళ్లటాన్ని ఆ కుటుబం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కాగానొక్కడు..మాత్రమే ఆ కుటుంబాలకు కావటంతో భరించలేని బాధతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ప్రణీత్ కూడా ఇంటికి ఒక్కడే మగబిడ్డ. తండ్రి రాంబాబు (రాము) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి భారతి ఇంట్లోనే ఉంటారు. రెండు కుటుంబాలు వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.