నగలను చూపిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు
ఆ ఐదుగురు...
Published Mon, Aug 22 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
పంజగుట్ట: వారంతా మైనర్లు.. నలుగురు టెన్త్, ఇంటర్ విద్యార్థులు కాగా.. ఒక్కడు మాత్రం సోఫాసెట్ పని చేస్తున్నాడు. స్నేహితులైన వీరంతా చిన్ననాటి నుంచే జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నారు. పంజగుట్ట పోలీసులు ఈ ఐదుగురినీ అరెస్టు చేసి, రూ. 15 లక్షల విలువైన 35 తులాల బంగారం, ఒక ల్యాప్‌టాప్, 17 సెల్‌ఫోన్లు 2 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పంజగుట్ట ఠాణాలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ నందీనగర్, ఇబ్రహీంనగర్, నూర్‌నగర్, దూద్‌ఖానా ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాలురు స్నేహితులు. చిన్నతనం నుంచే మద్యం తాగి విందు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం చోరీల బాట పట్టారు.
రెక్కీ నిర్వహించి...
రాత్రి వేళల్లో ఎవరు గడియపెట్టుకోకుండా పడుకుంటారు? ఏ ఇంట్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు? ఏ ఇంట్లో సులభంగా చోరీ చేయవచ్చు అనేది రెక్కీ నిర్వహించి గుర్తిస్తారు. టార్గెట్ చేసుకున్న ఇంట్లో ఆ మరునాడే చొరబడతారు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, సెల్‌ఫోన్లు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటివి ఎత్తుకెళ్తారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తారు. వీరు పంజగుట్ట, బంజారాహిల్స్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో ఆరు దొంగతనాలు చేశారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు వచ్చిన వీరిని విశ్వసనీయ సమాచారం మేరకు పంజగుట్ట క్రైమ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ బాలుడిపై సైఫాబాద్ ఠాణాలో గతంలోనే ఓ కేసు ఉందని పోలీసులు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, డీఐ లక్ష్మీనారాయణరెడ్డిలు వివరాలు వెల్లడించారు.
Advertisement