ఈ పాదం నటరాజుకే అంకితం | Special Story Famous Kuchipudi Dancer Shobha Naidu | Sakshi
Sakshi News home page

ఈ పాదం నటరాజుకే అంకితం

Published Thu, Oct 15 2020 3:58 AM | Last Updated on Thu, Oct 15 2020 11:16 AM

Special Story Famous Kuchipudi Dancer Shobha Naidu - Sakshi

అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. తెలుగువారి నృత్యరీతికి జీవితాన్ని ధారపోసిన ఆమె ప్రయాణం ఇకపై మరోలోకంలో కొనసాగనుంది. శోభానాయుడు అనే అసలు పేరును, కూచిపూడి మహారాణి అనే ముద్దుపేరును కలిగిన ఆ నాట్యశిరోమణి ఒక జీవితకాలంలో పది జీవిత కాలాల కృషిని చేసింది. దేశ విదేశాల్లో రెండువేల మంది విద్యార్థులు ఆమె దారిలో కూచిపూడి నాట్యతారలుగా మెరుస్తున్నారు. ఆమె తయారు చేసిన వందకు పైగా సోలో కొరియోగ్రఫీలు రాబోయే తరాలకు నాట్యగ్రంథంగా మారనున్నాయి.  ఆమే సత్యభామ. ఆమే చండాలిక.  ఆమే దుర్గ. ఆమే దేవదేవి. ఆమె కోసమే కూచిపూడి రూపుదిద్దుకుంది. కూచిపూడి కోసమే ఆమె జన్మించింది. ఒక నృత్యకారిణి, భారతీయ స్త్రీ సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం... మరెంతో అంకితభావం ఉండాలి.  తనకు అవి ఉన్నాయని ఆఖరి శ్వాస వరకూ నిరూపించిన నాట్యవిదుషీమణి శోభానాయుడు. నేడు ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. మువ్వలు మూగపోయాయి. తెలుగు వారి నాట్యం ఈ ధ్రువతారకు సదా రుణపడే ఉంటుంది.  

శోభానాయుడు జీవితాన్ని తరచి చూస్తే కూచిపూడి కోసం ఆమె ఎంత నిబద్ధతతో పని చేశారో తెలుసుకుని గౌరవం రెట్టింపవుతుంది. ఆమె కూచిపూడి మీద ప్రేమతో ఇతర నాట్యరీతులను కూడా నేర్చుకోలేదు. కోట్లరూపాయలు రాగల సినిమా అవకాశాలను తృణీకరించారు. ఆమె ఆరోప్రాణం మాత్రమే ఆమెది. పంచప్రాణాలూ కూచిపూడే. 

అనకాపల్లి అమ్మాయి
శోభానాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రాజమండ్రిలో పెరిగారు. తండ్రి వెంకట రెడ్డి ఇంజినీరు. తల్లి సరోజమ్మ గృహిణి. తండ్రికి నృత్యాలు, కళలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ పెంచుకున్న కూతురి నైపుణ్యాన్ని గ్రహించి తల్లి సరోజమ్మ ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదనే నమ్మకంతో తొలుత రాజమండ్రిలోని నాట్యాచార్యుడు పి.ఎల్‌.రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభా నాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా, మెరుగైన శిక్షణ కోసం సరోజమ్మ ఆమెను మద్రాసు తీసుకువచ్చి, వెంపటి చినసత్యం వద్ద చేర్పించారు. కూతురి శిక్షణ కోసం పదకొండేళ్లు ఒక చిన్న ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారు. వెంపటి చినసత్యం వద్ద శోభా నాయుడు గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కుమార్తె శివరంజని తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కూచిపూడి నర్తకిగా రాణిస్తున్నారు.

అరండేల్‌ ఆశీస్సులు...
శోభా నాయుడు అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి, భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్‌ ఎంతగానో ముగ్ధులయ్యారు. ‘అనవసరంగా సినిమాల వ్యామోహంలో చిక్కుకోవద్దు. కూచిపూడి ప్రక్రియకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు’ అంటూ ఆశీర్వదించారు. రుక్మిణీదేవి అరండేల్‌ సలహాను శోభా నాయుడు అక్షరాలా పాటించి, పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వివిధ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్యరూపకాల్లో కీలక పాత్రలు ధరించి, తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలోనూ ఆమె చిరస్మరణీయమైన కృషి చేశారు.

నృత్య రంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ  విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో ఊరేగించి.. పల్లకీ మోశారు
 

సత్యభామ
శోభానాయుడు ‘భామా కలాపం’తో చాలా ఖ్యాతి పొందారు. సత్యభామగా సినిమాల్లో జమున అభినయానికి కీర్తిగడిస్తే కూచిపూడిలో శోభానాయుడు ఖ్యాతి గడించారు. ఆమె ప్రదర్శించే శ్రీకృష్ణపారిజాతం రూపకాన్ని తిలకించేందుకు జనం పోటెత్తేవారు. భర్త అయిన కృష్ణుడి మీద దాచుకోవాలనిపించేంత ప్రేమ, తనమీద అతడి ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం దూరంగా నెట్టేస్తూనే దగ్గరకు తీసుకోవాలన్న ఆత్రం... ఇవన్నీ ఆమె సత్యభామ పాత్రలో ఆద్భుతంగా చూపిస్తారు. 
‘శ్రీనివాస కళ్యాణం’,  ‘శ్రీకృష్ణ శరణం మమ’,  ‘చండాలిక’, ‘మేనక–విశ్వామిత్ర’, ‘విప్రనారాయణ’, ‘విజయోస్తు నారీ’, ‘గిరిజా కళ్యాణం’, ‘స్వామి వివేకానంద’ వంటి దాదాపు పదహారు నృత్యరూపకాలను, నృత్యనాటికలను శోభానాయుడు తన బృందంతో కలసి దేశ విదేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో లెక్కకు మిక్కిలిసార్లు ప్రదర్శించారు. ఎన్నో సోలో ప్రదర్శనలూ ఇచ్చారు. ‘సత్యభామ’ పాత్రలో చేసే అభినయానికి ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నృత్య నాటికలో అన్ని పాత్రలనూ తానే అభినయిస్తూ చేసే ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం.

బ్లాంక్‌ చెక్‌ ఇచ్చినా...
ఎన్నో అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చినా శోభా నాయుడు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. పదహారేళ్ల వయసులో ‘అభిమానవంతులు’ (1973) సినిమాలో ‘ఎప్పటివలె కాదురా నా స్వామి... ఎప్పటివలె కాదురా’ అనే పాటలో వెండితెరపై మెరిసిన శోభా నాయుడుకు ఆ తర్వాత కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌ ఆమెను తన సినిమాల్లో నటించమని కోరారు. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కారు పంపించి, తన సినిమాలో నటించాల్సిందిగా తానే స్వయంగా అడిగారు. ఈ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.నాగిరెడ్డి ఏకంగా బ్లాంక్‌ చెక్‌ చేతిలో పెట్టినా, తిరిగి ఇచ్చేసి, నాట్యానికే పూర్తిగా అంకితం కాదలచుకున్నానని చెప్పారు. నాగిరెడ్డి కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అలాగని, శోభా నాయుడుకు సినిమాలంటే వ్యతిరేకత ఏమీ లేదు గాని, కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కాగలవనే కారణంతోనే ఆమె చాలా అవకాశాలను వదులుకున్నారు. అయితే, తన గురువు వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వం వహించిన వాటిలో ‘అమెరికా అమ్మాయి’ వంటి అతికొద్ది చిత్రాలకు సహాయ నృత్యదర్శకురాలిగా పనిచేశారు. 

తీరని కోరిక... నృత్య గ్రంథాలయం
కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు ఐదు శతాబ్దాలు పురుషులే నాట్యాచార్యులుగా ఏలారు. శోభా నాయుడు సాగించిన నిరుపమానమైన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూచిపూడి నృత్య అకాడమీ ప్రిన్సిపాల్‌గా 1981లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. ఆమెకు దాదాపు 1500 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్య అకాడమీని శాఖోపశాఖలుగా విస్తరించారు. 

ఎన్నెన్నో పురస్కారాలు
సంప్రదాయ నృత్యరంగంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996),  ‘ఎన్టీఆర్‌ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. నిజానికి శోభానాయుడు కృషి మరో రెండు దశాబ్దాలైనా కొనసాగాల్సింది. ఆమె మరెన్ని ఎత్తులకు ఎదగాల్సింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పాడు సంవత్సరం ఆమెను తీసుకుపోయి తెలుగువారిని నిజంగా వంచించింది. 
ఇది క్షమార్హం కాని కాలం. 
– పన్యాల జగన్నాథ దాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement