Shobha Naidu
-
పేరు, హోదా.. అమ్మ పెట్టిన భిక్షే
కూచిపూడి నృత్య ప్రపంచంలో నేటితరం మహారాణి ఆమె.. సృజనాత్మక ప్రక్రియల్లో ఆరితేరిన కళాకారిణి. ఆమె నాట్యం ఓ అద్భుతం.. నర్తించే సమయంలో ఆమె పలికించే హావభావాలు అత్యద్భుతం. ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చిన శాస్త్రీయ సంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు ఇకలేరు అనగానే నృత్యం కళావిహీనమైంది. ఆ పాదాల గజ్జెలు మౌనం దాల్చాయి. నృత్య ప్రపంచం కన్నీరుమున్నీరై విలపించింది. సాక్షి, మద్దిలపాలెం/అనకాపల్లి: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభానాయుడు అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశ్వవ్యాప్తంగా తన నాట్యంతో అభిమానులను సంపాదించుకున్న ఆమె అనకాపల్లిలోనే పుట్టారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఆమె తల్లి సరోజనిదేవి, వెంకటనాయుడులకు 1956లో జన్మించారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎదుగుతారని తల్లి చిన్నప్పుడే గుర్తించారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు.. శోభానాయుడు కాళ్లు, చేతుల కదలికలను సరోజనిదేవి గమనించారు. అప్పుడే శోభానాయుడికి నృత్యం నేర్పించాలని భావించారు. ఇందుకోసం ఆమె కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారంట. ఇదే విషయాన్ని శోభానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేరు హోదా అమ్మ పెట్టిన భిక్షే అంటూ వెల్లడించారు. ఆమె మూడో ఏటన ఆ కుటుంబం రాజమండ్రికి వెళ్లిపోయింది. అక్కడ నాల్గో ఏట నుంచే శోభానాయుడికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించేందుకు తల్లి దృష్టి సారించారు. నృత్యంలో ఆమె ఇచ్చిన హావభావాలు, అభినయం చూసి తల్లి.. మరింత బాగా తీర్చిదిద్దాలని చెన్నైలోని చిన వెంపటి సత్యం వద్ద శిక్షణకు పంపించారు. ఆడపిల్లను అంత దూరం పంపించే విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సరోజనిదేవి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమార్తెలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. తల్లి ఇచ్చిన ప్రేరణే శోభానాయుడిని ఈ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా 12 ఏళ్లకే ప్రదర్శనివ్వడం ప్రారంభించిన శోభానాయుడు సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె బహుముఖ ప్రతిభకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న శోభానాయుడు కూచిపూడి కళాప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. విశాఖతో అనుబంధం కళల ఖిల్లాగా భాసిల్లుతున్న విశాఖ నగరంలో ఏ కళా, సాంస్కృతిక ఉత్సవాలు జరిగినా.. ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచేవారు. అగ్రస్థానం ఆమెకే ఇచ్చేవారు. కళాభారతి ఆడిటోరియంలో నగరానికి చెందిన పలు నృత్య కళా అకాడమీలు నిర్వహించే సాంస్కృతిక వేడుకలకు ఆమె హాజరయ్యేవారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వేడుకల్లో భాగంగా శోభానాయుడిని పల్లకీలో తోడ్కొని వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఆమె అనుభవాన్ని రంగరించి ఇదే వేదికపైన నాట్య ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాయినాథ్ నృత్య కళా నిలయం, నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వర్ధమాన నృత్య కళాకారులకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె అభినయాన్ని, అనుభవాలను ఎప్పటికప్పుడు నృత్యకళాకారులకు వినిపించేందుకు ఆయా సంస్థలు చేసిన కృషికి శోభానాయుడు ఎంతో సంబరపడేవారు. కళాభారతి వేదికగా శోభానాయుడు ప్రదర్శించిన ‘సత్యభామా కలాపం’ నృత్యరూపకం అద్వితీయంగా సాగింది. సత్యభామగా శోభానాయుడు ఒదిగిన తీరు.. పలికించిన హావభావాలు, అలకలతో సాగిన ప్రదర్శనతో విశాఖ కళాప్రియుల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరోసారి శోభానాయుడు స్వీయ నృత్య రూపకం ‘నవరస నట భామిని’ ప్రదర్శనలో ఆమె పలికించిన నవరసాలతో.. కళాప్రియులు పులకించిపోయారు. నవరసాల్లో పాత్రలను అవలీలగా ఆమె ఆవిష్కరించిన తీరు ఆహూతులను అబ్బురపరిచింది. మరో ప్రదర్శనలో శివుని భార్య సతీదేవిగా అగ్నికి ఆహుతి అయ్యే సన్నివేశంలో శోభానాయుడు నటన నభూతో న భవిష్యత్‌గా నిలిచిపోయింది. ఆ సన్నివేశంలో సతీదేవి పాత్రలో లీనమై.. చక్కని ప్రదర్శనిచ్చిన ఆమెకు ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులతో నీరాజనం పలికారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 2018లో ఆర్కేబీచ్లో ఏర్పాటు చేసిన శివరాత్రి వేడుకల్లో శోభానాయుడు హాజరయ్యారు. ఆ వేడుకల్లో ఆమె తన నృత్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా ఆమెను కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. మంత్రి ముత్తంశెట్టి సంతాపం మహారాణిపేట(విశాఖ దక్షిణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డ శోభానాయుడు కళామతల్లి ముద్దు బిడ్డ, కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు.. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరయ్యేవారు. కళాసమితి చిన్నారులకు ఆమె అమూల్యమైన సందేశం ఇచ్చి స్ఫూర్తి రగిలించేవారు. అంతరించిపోతున్న కళా నృత్యాలను జీవం పోయడానికి ఆమె పడిన కష్టం, చేసిన కృషి మరువలేనివి. – డాక్టర్ అరుణ్ సాయికుమార్, సాయినాథ్ కళా సమితి వ్యవస్థాపకుడు నాట్యరంగానికి తీరని లోటు అనకాపల్లిలో పుట్టిన శోభానాయుడు మృతి కూచిపూడి నృత్యానికి తీరని లోటు. చినవెంపటి సత్యం వద్ద శిక్షణ తీసుకున్న శోభానాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. కూచిపూడి ఆర్ట్స్ స్కూల్ పేరుతో శోభానాయుడు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించి ఎంతోమందికి శిక్షణ అందించారు. –ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్. కల్యాణి నృత్య సంగీత అకాడమీ, అనకాపల్లి -
ఈ పాదం నటరాజుకే అంకితం
అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. తెలుగువారి నృత్యరీతికి జీవితాన్ని ధారపోసిన ఆమె ప్రయాణం ఇకపై మరోలోకంలో కొనసాగనుంది. శోభానాయుడు అనే అసలు పేరును, కూచిపూడి మహారాణి అనే ముద్దుపేరును కలిగిన ఆ నాట్యశిరోమణి ఒక జీవితకాలంలో పది జీవిత కాలాల కృషిని చేసింది. దేశ విదేశాల్లో రెండువేల మంది విద్యార్థులు ఆమె దారిలో కూచిపూడి నాట్యతారలుగా మెరుస్తున్నారు. ఆమె తయారు చేసిన వందకు పైగా సోలో కొరియోగ్రఫీలు రాబోయే తరాలకు నాట్యగ్రంథంగా మారనున్నాయి. ఆమే సత్యభామ. ఆమే చండాలిక. ఆమే దుర్గ. ఆమే దేవదేవి. ఆమె కోసమే కూచిపూడి రూపుదిద్దుకుంది. కూచిపూడి కోసమే ఆమె జన్మించింది. ఒక నృత్యకారిణి, భారతీయ స్త్రీ సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం... మరెంతో అంకితభావం ఉండాలి. తనకు అవి ఉన్నాయని ఆఖరి శ్వాస వరకూ నిరూపించిన నాట్యవిదుషీమణి శోభానాయుడు. నేడు ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. మువ్వలు మూగపోయాయి. తెలుగు వారి నాట్యం ఈ ధ్రువతారకు సదా రుణపడే ఉంటుంది. శోభానాయుడు జీవితాన్ని తరచి చూస్తే కూచిపూడి కోసం ఆమె ఎంత నిబద్ధతతో పని చేశారో తెలుసుకుని గౌరవం రెట్టింపవుతుంది. ఆమె కూచిపూడి మీద ప్రేమతో ఇతర నాట్యరీతులను కూడా నేర్చుకోలేదు. కోట్లరూపాయలు రాగల సినిమా అవకాశాలను తృణీకరించారు. ఆమె ఆరోప్రాణం మాత్రమే ఆమెది. పంచప్రాణాలూ కూచిపూడే. అనకాపల్లి అమ్మాయి శోభానాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రాజమండ్రిలో పెరిగారు. తండ్రి వెంకట రెడ్డి ఇంజినీరు. తల్లి సరోజమ్మ గృహిణి. తండ్రికి నృత్యాలు, కళలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ పెంచుకున్న కూతురి నైపుణ్యాన్ని గ్రహించి తల్లి సరోజమ్మ ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదనే నమ్మకంతో తొలుత రాజమండ్రిలోని నాట్యాచార్యుడు పి.ఎల్.రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభా నాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా, మెరుగైన శిక్షణ కోసం సరోజమ్మ ఆమెను మద్రాసు తీసుకువచ్చి, వెంపటి చినసత్యం వద్ద చేర్పించారు. కూతురి శిక్షణ కోసం పదకొండేళ్లు ఒక చిన్న ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారు. వెంపటి చినసత్యం వద్ద శోభా నాయుడు గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కుమార్తె శివరంజని తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కూచిపూడి నర్తకిగా రాణిస్తున్నారు. అరండేల్ ఆశీస్సులు... శోభా నాయుడు అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి, భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్ ఎంతగానో ముగ్ధులయ్యారు. ‘అనవసరంగా సినిమాల వ్యామోహంలో చిక్కుకోవద్దు. కూచిపూడి ప్రక్రియకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు’ అంటూ ఆశీర్వదించారు. రుక్మిణీదేవి అరండేల్ సలహాను శోభా నాయుడు అక్షరాలా పాటించి, పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వివిధ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్యరూపకాల్లో కీలక పాత్రలు ధరించి, తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలోనూ ఆమె చిరస్మరణీయమైన కృషి చేశారు. నృత్య రంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో ఊరేగించి.. పల్లకీ మోశారు. సత్యభామ శోభానాయుడు ‘భామా కలాపం’తో చాలా ఖ్యాతి పొందారు. సత్యభామగా సినిమాల్లో జమున అభినయానికి కీర్తిగడిస్తే కూచిపూడిలో శోభానాయుడు ఖ్యాతి గడించారు. ఆమె ప్రదర్శించే శ్రీకృష్ణపారిజాతం రూపకాన్ని తిలకించేందుకు జనం పోటెత్తేవారు. భర్త అయిన కృష్ణుడి మీద దాచుకోవాలనిపించేంత ప్రేమ, తనమీద అతడి ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం దూరంగా నెట్టేస్తూనే దగ్గరకు తీసుకోవాలన్న ఆత్రం... ఇవన్నీ ఆమె సత్యభామ పాత్రలో ఆద్భుతంగా చూపిస్తారు. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘శ్రీకృష్ణ శరణం మమ’, ‘చండాలిక’, ‘మేనక–విశ్వామిత్ర’, ‘విప్రనారాయణ’, ‘విజయోస్తు నారీ’, ‘గిరిజా కళ్యాణం’, ‘స్వామి వివేకానంద’ వంటి దాదాపు పదహారు నృత్యరూపకాలను, నృత్యనాటికలను శోభానాయుడు తన బృందంతో కలసి దేశ విదేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో లెక్కకు మిక్కిలిసార్లు ప్రదర్శించారు. ఎన్నో సోలో ప్రదర్శనలూ ఇచ్చారు. ‘సత్యభామ’ పాత్రలో చేసే అభినయానికి ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నృత్య నాటికలో అన్ని పాత్రలనూ తానే అభినయిస్తూ చేసే ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. బ్లాంక్ చెక్ ఇచ్చినా... ఎన్నో అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చినా శోభా నాయుడు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. పదహారేళ్ల వయసులో ‘అభిమానవంతులు’ (1973) సినిమాలో ‘ఎప్పటివలె కాదురా నా స్వామి... ఎప్పటివలె కాదురా’ అనే పాటలో వెండితెరపై మెరిసిన శోభా నాయుడుకు ఆ తర్వాత కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఆమెను తన సినిమాల్లో నటించమని కోరారు. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కారు పంపించి, తన సినిమాలో నటించాల్సిందిగా తానే స్వయంగా అడిగారు. ఈ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.నాగిరెడ్డి ఏకంగా బ్లాంక్ చెక్ చేతిలో పెట్టినా, తిరిగి ఇచ్చేసి, నాట్యానికే పూర్తిగా అంకితం కాదలచుకున్నానని చెప్పారు. నాగిరెడ్డి కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అలాగని, శోభా నాయుడుకు సినిమాలంటే వ్యతిరేకత ఏమీ లేదు గాని, కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కాగలవనే కారణంతోనే ఆమె చాలా అవకాశాలను వదులుకున్నారు. అయితే, తన గురువు వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వం వహించిన వాటిలో ‘అమెరికా అమ్మాయి’ వంటి అతికొద్ది చిత్రాలకు సహాయ నృత్యదర్శకురాలిగా పనిచేశారు. తీరని కోరిక... నృత్య గ్రంథాలయం కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు ఐదు శతాబ్దాలు పురుషులే నాట్యాచార్యులుగా ఏలారు. శోభా నాయుడు సాగించిన నిరుపమానమైన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూచిపూడి నృత్య అకాడమీ ప్రిన్సిపాల్‌గా 1981లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. ఆమెకు దాదాపు 1500 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్య అకాడమీని శాఖోపశాఖలుగా విస్తరించారు. ఎన్నెన్నో పురస్కారాలు సంప్రదాయ నృత్యరంగంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. నిజానికి శోభానాయుడు కృషి మరో రెండు దశాబ్దాలైనా కొనసాగాల్సింది. ఆమె మరెన్ని ఎత్తులకు ఎదగాల్సింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పాడు సంవత్సరం ఆమెను తీసుకుపోయి తెలుగువారిని నిజంగా వంచించింది. ఇది క్షమార్హం కాని కాలం. – పన్యాల జగన్నాథ దాసు -
శోభా నాయుడు నన్ను ప్రశంసించారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘శోభా నాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. కూచిపూడి నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి గొప్పతనాన్ని విదేశాల్లో కూడా చాటారు. ఆమెతో నాకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంసించుకునే వాళ్లం. శుభలేఖ చిత్రంలో నా క్లాసికల్ డ్యాన్స్ చూసి ఆమె నన్ను ఎంతో ప్రశంసించారు. అది నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో ఆమెకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నప్పటికి నృత్యానికే అంకితం అయ్యారు’ అని తెలిపారు. (చదవండి: ‘ఏ వార్త వినకూడదు అనుకున్నామో.. ’) Rest in peace #ShobhaNaidu garu. pic.twitter.com/y3zgf4VrBM — Chiranjeevi Konidela (@KChiruTweets) October 14, 2020 ‘ఈ మధ్య కాలంలో కూడా కరోనా గురించి జనాలకు అవగాహన కల్పించడం కోసం శోభా నాయుడు ఒక డ్యాన్స్ వీడియోను రూపొందించారు. అది చూసిన వెంటనే నేను ఆమెకు కాల్ చేసి అభినందించాను. సమాజ శ్రేయస్సు కోసం తన కళను వినియోగించారు. భారత దేశానికి, తెలుగు జాతికి ఆమె చేసిన సేవకు సెల్యూట్ చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. -
నాట్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
-
శోభా నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.