దృశ్యకారిణి | Yamini Reddy Shared His Dance Scene With A Sakshi | Sakshi
Sakshi News home page

దృశ్యకారిణి

Published Mon, Nov 4 2019 2:40 AM | Last Updated on Mon, Nov 4 2019 2:43 AM

Yamini Reddy Shared His Dance Scene With A Sakshi

ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు యామినీ రెడ్డి. మహాకవులు రాసిన గొప్ప గ్రంథాలలోని భావానికి నాట్య రూపం ఇది. సాహిత్యాభిలాషులకు నాట్యాన్ని దగ్గర చేయడంతోపాటు సామాన్యులకు గొప్ప గ్రంథాలలోని మార్మికత అర్థమయ్యేటట్లు భావాన్ని వివరిస్తూ దానిని కళ్ల ముందు ఆవిష్కరించడమే దృశ్య కావ్య. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీతలు రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల కుమార్తె అయిన యామిని తన నాట్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు.

మూడేళ్ల వయసులో స్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి గజ్జె కట్టుకున్నారు యామిని. పాదాలతో పదనిసలు పలికించడం, కళ్లలో భావాన్ని అభినయించడం యామినికి చిన్నప్పటి నుంచే అలవాటైంది. అయితే ఆమె సంపూర్ణ నర్తకిగా రంగప్రవేశం చేయడానికి ఇరవై ఏళ్లు దాటే వరకు ఆగాల్సి వచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే యామినిని నర్తకిని చేయాలనే కోరిక అమ్మానాన్నలకు లేకపోవడంతో ఆమె రంగప్రవేశానికి అంత టైమ్‌ పట్టింది.

కూతురు ప్రొఫెషనల్‌ కోర్సు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది తల్లి కోరిక. తండ్రికి మాత్రం కూతురికి ఏ రంగం ఇష్టమైతే ఆ రంగం వైపు ప్రోత్సహిద్దామనే అభిలాష తప్ప ప్రత్యేకంగా ఏ నిబంధనా లేదు. డాక్టర్‌ అయితే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందనే భయంతో యామిని మెడిసిన్‌ సీటును వదులుకున్నారు. ‘ఈ సీటు వదిలేశావ్‌ సరే, మరేదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో చేరు’ అనేది ఆమె తల్లి. అమ్మ మాట కోసం మాత్రమే యామిని ఎంబీఏ చేశారు.

అప్పుడు కూడా ‘‘నాకు ఉద్యోగం చేయాలని లేదు, డ్యాన్స్‌ చేయాలని ఉంది’’ అందామె స్థిరంగా.‘‘పర్‌ఫెక్షన్‌ వచ్చే వరకు సాధన చెయ్యి. నీ పెర్‌ఫార్మెన్స్‌ చూసిన తర్వాత రంగప్రవేశం చేయవచ్చో లేదో నిర్ణయిస్తాను’’ అన్నారు తండ్రి. కూతురి మొండి పట్టుదలతో సాధన చేయడాన్ని, నాట్యంలో ఆమె సాధించిన మెళకువలను చూశాక మాత్రమే రంగప్రవేశం చేయడానికి అనుమతించారాయన. ‘‘మా నాన్న అంగీకారంగా తలూపడం అంటే యూనివర్సిటీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లే’’ అన్నారామె నవ్వుతూ.

అమ్మకు ఇష్టం లేదు
‘‘నాన్న, అమ్మ ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి పడిన కష్టం చిన్నది కాదు. కళారంగంలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని, నాట్యాన్ని కెరీర్‌గా తీసుకుంటే కొద్ది కాలానికే రిటైర్‌ కావలసి వస్తుందని అమ్మ భయం. ‘అమ్మా నా ఇష్టం నాట్యంలో ఉన్నప్పుడు మరే పని చేసినా మనసు చంపుకుని చేయాల్సిందే. నాట్యంలో నా కెరీర్‌ను కాపాడుకుంటాను. సవాళ్లకు భయపడను. మీరు పాటించిన సహనాన్ని నేను కూడా అలవరుచుకుంటాను’ అని అమ్మకు నచ్చచెప్పాను. నాట్యం అంటే భగవంతుడిని అర్చించే ఒక మార్గం. నేను అంతే అంకితభావంతో కూచిపూడి నాట్యం సాధన చేస్తుండడంతో అమ్మానాన్నలకు నా మీద నమ్మకం కలిగింది. నా కోసం హైదరాబాద్‌లో 2007లో నాట్య తరంగిణి డ్యాన్స్‌ స్కూల్‌ శాఖను ప్రారంభించారు. అప్పటి నుంచి నా మీద బాధ్యత పెరిగింది. నాట్య ప్రదర్శనలతోపాటు స్కూల్‌ నిర్వహణ చూసుకుంటున్నాను.

నాట్యం ఒక ప్రవాహం
నాట్యం తటాకంలా ఉండకూడదు. ప్రవహించే నదిలాగ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. నాట్యంలో ప్రయోగాలు చేస్తూనే ఉండాలనేది నాన్న పాటించిన సూత్రం, మాకు నేర్పించిన పాఠం. ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఇటీవల కొత్తతరంలో డ్యాన్స్‌కు ఆదరణ పెరిగింది, కానీ పొయెట్రీ చదవడం పూర్తిగా కనుమరుగైపోతోంది.

ఊతుకాడు వెంకటసుబ్బయార్, తులసీదాస్, స్వాతి పెరుమాళ్, జయదేవ, నారాయణ తీర్థ వంటి మహాకవుల గురించి ఈతరం పిల్లలకు తెలిసే అవకాశం తక్కువ. వీళ్ల రచనల ఆధారంగానే దృశ్యకావ్యను రూపొందించాను. ఇందులో నాతోపాటు నా శిష్యులు పదిమంది పాల్గొంటున్నారు. ఈ ప్రయత్నం వల్ల పిల్లల్లో మన గ్రంథాల పట్ల ఆసక్తి కలగాలనేది నా కోరిక.

నేర్పించాను... నిర్ణయించను
మా అబ్బాయికి ఏడేళ్లు. తనకు కూచిపూడిలో బేసిక్స్‌ నేర్పించాను. తనను డ్యాన్సర్‌ని చేయాలనే నిర్ణయం నేను తీసుకోను. ఇప్పుడు నేనసలే ఏమీ నేర్పించకపోతే.... రేపు బాబు పెద్దయిన తర్వాత ‘నాకెందుకు నేర్పించలేదమ్మా’ అని బాధపడకూడదు కదా! అందుకోసం మాత్రమే తల్లిగా నా బాధ్యత అన్నట్లు నేర్పిస్తున్నాను. నాట్య ప్రదర్శన కోసం బయటికి వెళ్లినప్పుడు బాబు నన్ను మిస్‌ అవుతున్నాడనే అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది.

అందుకే వారంలో రెండు రోజులు నా వర్క్‌ నుంచి హాలిడే తీసుకుని ఆ రెండు రోజులూ పూర్తిగా బాబు కోసమే కేటాయిస్తున్నాను. వృత్తి బాధ్యతను, తల్లి బాధ్యతను బ్యాలెన్స్‌ చేయడం కష్టం అని చెప్పను కానీ, చాలా సున్నితంగా డీల్‌ చేసుకోవాలని మాత్రం చెప్తాను. అలా సమన్వయం చేసుకోగలిగిన నేర్పు ఆడవాళ్లలో ఉంటుంది కూడా’’ అన్నారు యామిని.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: రాజేశ్‌ రెడ్డి

ప్రశంస–పురస్కారాలు
‘యామిని డ్యాన్స్‌ కోసమే పుట్టిన అమ్మాయి. సంపూర్ణమైన నాట్యకారిణి’ యామిని నాట్యం చూసిన ప్రసిద్ధ సితార్‌ విద్వాంసులు, భారతరత్న పండిట్‌ రవిశంకర్‌ ఇచ్చిన ప్రశంస ఇది. ఆమె సంగీత నాటక అకాడమీ, జాతీయ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం, దేవదాసి నేషనల్‌ అవార్డు, ఫిక్కీ యంగ్‌ అచీవర్స్‌ అవార్డులు, ఐర్లాండ్, యూఎస్‌లలో స్థానిక సాంస్కృతిక పురస్కారాలు అందుకున్నారు. నాట్యం మీద ఆమె  ‘ఆడియన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ద పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని కూడా రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement