వాహ్‌... ఉస్తాద్‌లు | Telugu Womens Received Ustad Bismillah Khan Yuva Puraskar Award 2024-25 | Sakshi
Sakshi News home page

వాహ్‌... ఉస్తాద్‌లు

Published Thu, Nov 28 2024 12:32 AM | Last Updated on Thu, Nov 28 2024 10:15 AM

Telugu Womens Received Ustad Bismillah Khan Yuva Puraskar Award 2024-25

ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువపురస్కారం అందుకున్న  తెలుగు మహిళలు.

ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌... ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. 
నాదం ఆయన షెహనాయ్‌లో ప్రణవనాదంగా భాసిల్లింది. 
ఆయన ఉఛ్వాస నిశ్వాసలు నాదంతోనే... నాదస్వరంతోనే. 
ఆ నాదం స్మృతిగా మిగలరాదు... శ్రుతిగా కొనసాగాలి. 
కళాసాధనకు అంకితమైన కళాకారులే ఆయన వారసులు. 
బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం అందుకున్న మన మహిళలు వీళ్లు.

సరిగమల సాగరంలో నేనో బిందువుని
ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ గారి షెహనాయ్‌ వాద్యం అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికి వందల సార్లు కాదు వేలసార్లు విని ఉంటాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బిస్మిల్లా ఖాన్‌ సంగీత కార్యక్రమం వింటూ నిద్రపోతాను. మహా సముద్రం అంతటి సంగీతప్రపంచంలో ఆయన ఒక సముద్రం అయితే నేను ఒక నీటిబిందువుని. ఇలాంటి గొప్పవారు నాలాంటి ఎందరో సింగర్స్‌కు స్ఫూర్తినిస్తుంటారు. సంగీతమే శ్వాసగా జీవించిన బిస్మిల్లా ఖార్‌ పేరు మీద పురస్కారం అందుకోవడం అంటే సంతోషశిఖరాన్ని అధిరోహించినట్లే భావిస్తున్నాను. 

నాకు ఈ ఏడాది ఎన్నో మధురానుభూతులనిచ్చింది. కన్నడ పాటకు బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా సైమా అవార్డు, కర్నాటక ‘విశ్వమన్య’ పురస్కారం, తెలుగులో బలగం సినిమా పాటకు ఐఫా అవార్డు అందుకున్నాను. ఇంకా గొప్ప సంతృప్తి ఏమిటంటే... నేపథ్యగాయని పద్మభూషణ్‌ ఉషాఉతుప్, పద్మభూషణ్‌ సుధా రఘునాధన్‌ వంటి మహోన్నత గాయనీమణులతో కలిసి వేదిక పంచుకోవడం. బాలికల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా నిర్వహించిన సంగీతకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఈ జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఊహించనిది. ఈ ఏడాది నాకు ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. 
– సత్యవతి ముదావత్‌ (మంగ్లీ), సినీ నేపథ్య గాయని

లక్ష్యం మారింది
చిత్తూరులో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన రెడ్డి లక్ష్మి ఐఏఎస్‌ లక్ష్యంతో గ్రాడ్యుయేషన్‌కి ఢిల్లీకి వెళ్లారు. ఆమె మీద కళా తపస్వి విశ్వనాథ్‌ సినిమాల ప్రభావం కూడా ఎక్కువే. డిగ్రీ చదువుతూ కూచిపూడి నాట్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఆ ఆసక్తి ఆమెను ఏకంగా ఢిల్లీలో డాన్స్‌ ఆకాడమీ స్థాపించేవరకు తీసుకెళ్లింది.  కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ఇలాంటి పురస్కారాలు భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం వంటివన్నారు లక్ష్మి. 

పన్నెండేళ్లుగా ఢిల్లీలో ‘నృత్యవాహిని – అకాడమీ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌’ను నిర్వహిస్తున్నారామె. ఢిల్లీ వంటి నగరంలో నాట్యప్రదర్శన పట్ల ఆసక్తితో సుశిక్షితులై సాధన చేసినప్పటికీ చాలా మందికి ప్రదర్శనకు సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి నాట్య ప్రదర్శనకు అనువైన ఈవెంట్స్‌ ద్వారా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. 

కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకోవడం వల్ల ఆమె సేవ ఎల్లలు దాటింది. ఆన్‌లైన్‌లో వివిధ దేశాల నుంచి విదేశీయులతోపాటు ఎన్నారైలు కూడా ఆమె దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. ఢిల్లీలో రెగ్యులర్‌గా నిర్వహించే క్లాసుల్లో తెలుగు వాళ్లతోపాటు వివిధ భాషల వాళ్లున్నారు. బిస్మిల్లా ఖాన్‌ యువపురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె తన గురువు గారి మార్గదర్శనాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘ఈ రోజు ఈ పురస్కారం అందుకున్నానంటే మా గురువుగారు పద్మశ్రీ గురు జయరామారావుగారి సూచనను పాటించడం వల్లనే. ఆయన పిఠాపురంలో పుట్టారు. కూచిపూడికి వెళ్లి నాట్యం నేర్చుకున్నారు. కాకతాళీయంగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో డాన్స్‌ అకాడమీ అవసరం చాలా ఉంది. మన కళారీతులను విశ్వవ్యాప్తం చేయడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి... అని నాకొక డైరెక్షన్‌ ఇచ్చారు. వారి సహకారంతోనే ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ స్కూల్‌లో డాన్స్‌ టీచర్‌గా ఉద్యోగం చేశాను. 

ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం చేసినప్పటికీ నాట్యం కోసం పని చేస్తున్నప్పుడు కలిగిన సంతోషం ఉండేది కాదు. నాట్యంలో నా కళాతృష్ణను తీర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకున్నాను. ఆ తర్వాత భరతనాట్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పీజీ చేస్తున్నాను. ఇతర నాట్యరీతుల్లోనూ ప్రవేశాన్ని సాధించాను. నాట్యంలో పీహెచ్‌డీ చేయడం నా ప్రస్తుత లక్ష్యం’’ అన్నారు రెడ్డి లక్ష్మి.

నా పాట నాకు నచ్చాలి!
‘‘ఇది నా తొలి జాతీయ పురస్కారం. తప్పకుండా నా జీవితంలో మధురమైన ఘట్టమే. చెన్నైలో నా గానం విన్న ప్రముఖులు గోల్డెన్‌ వాయిస్‌ అని ప్రశంసించినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం అందుకోవడం కూడా...’’ అన్నారు కర్ణాటక సంగీతకారిణి శ్వేతాప్రసాద్‌.  

‘‘మా ఇల్లు ఒక సంగీతం విశ్వవిద్యాలయం వంటిది. నానమ్మ గాయని, తాతయ్య (రక్తకన్నీరు నాగభూషణం) రంగస్థల ప్రదర్శనల్లో నానమ్మ పాల్గొనేది. అమ్మ వీణలో సిద్ధహస్తురాలు. మరో తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) మోహన్‌రావు. ఆయన హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభ స్థాపించడం, నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి ఇంట్లో పుట్టడం ఒక వరం. మూడేళ్ల వయసు నుంచి సరిగమలు కూడా నాతోపాటు పెరిగాయి. శోభానాయుడు, అలేఖ్య పుంజల వంటి ప్రముఖ నాట్యకారుల కార్యక్రమాలకు గానమిచ్చాను. నాకు సంగీతమే జీవితం. మరొకటి తెలియదు. నా భర్త నట్టువాంగం కళాకారులు. మేమిద్దరం ముప్పైకి పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చాం. మా తాతగారిలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉండడమే నా విజయరహస్యం.  

రక్తకన్నీరు స్ఫూర్తితో... 
నాగభూషణం తాతయ్య రక్తకన్నీరు నాటకాన్ని ఎనిమిది వేల సార్లు ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన దేనికది భిన్నంగా ఉండేలా చూసుకునేవారు. నిన్నటి కంటే నేడు మరికొంత భిన్నంగా, రేపు మరింత వైవిధ్యంగా ఉండేలా చూసేవారు. అలాగే ఒక ప్రదర్శనకంటే మరో ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేటట్లు నాకు నేను మెరుగులు దిద్దుకుంటాను. గాయకులు కానీ చిత్రకారులు కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య దగ్గరే ఆగిపోకూడదు. 

సాధన ద్వారా తనవంతుగా మరికొన్ని మెళకువలను అద్దగలగాలి. మన నైపుణ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఫలితం సంతోషకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను ‘నన్ను నేను మెప్పించుకోవాలి’ అనే కొలమానం పెట్టుకుని పాడుతాను. నా పాట నాకే నచ్చకపోతే మరొకరికి ఎలా నచ్చుతుంది? అనేదే నా ప్రశ్న. నా లక్ష్యం భవనాలు, కోట్ల రూపాయలు సంపాదించడం కాదు. సంగీతం నా ప్యాషన్‌. శుద్ధ సంగీతాన్ని పాడుతాను. సంగీతంతోనే జీవిస్తాను’’ అంటూ సంగీతం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు శ్వేతాప్రసాద్‌.

– వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement