
ఆరుగురు ఐకానిక్ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ లేకుండానే పనిచేస్తుంది. సబ్ ఆర్బిటల్ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.
ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్‌కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఎన్.ఎస్.–31 మిషన్ టెక్నాలజీ ఫీట్ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.
‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్ కింగ్.
‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్ సాంచెజ్.
ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్ మహిళల అంతరిక్షయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.
అయేషా బోవ్
నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్ మిచిగన్ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్ బోర్డ్’ అనే ఇంజినీరింగ్ కంపెనీకి అయేషా బోవ్ సీఈవో.
అమంద గుయెన్
హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్‌లో పనిచేసింది అమంద గుయెన్. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్ ఫైవ్: ఎ మెమోరియల్ ఆఫ్ హోప్’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.
లారెన్ సాంచెజ్
లారెన్ సాంచెజ్ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్‌గా పనిచేసింది. లారెన్ హెలికాప్టర్ పైలట్ కూడా. ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.
గేల్ కింగ్
మేరీల్యాండ్ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్ కింగ్‌కు రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్ కింగ్ ఇన్ ది హౌజ్’ అనే రేడియో షోని హోస్ట్ చేసింది. ఉత్తమ రేడియో టాక్ షో కోసం ఇచ్చే ‘అమెరికన్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ గ్రేసి అవార్డ్’ను సొంతం చేసుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.
కేటీ పెర్రీ
ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌లలో పాప్ స్టార్ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ రికార్డ్‌లు బ్రేక్ చేసింది. 13 గ్రామీ అవార్డ్‌లకు కేటీ నామినేట్ అయింది. బిల్‌బోర్డ్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్–2012’ అవార్డ్ అందుకుంది. ‘ఫైర్ వర్క్ ఫౌండేషన్’ మొదలుపెట్టి యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలు అందిస్తోంది.
కెరియానే ప్లిన్
కెరియానే ప్లిన్ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్‌లో ఆమె తీసిన దిస్ చేంజెస్ ఎవ్రీ థింగ్ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్‌కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి.