అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్‌ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో భూమిపై దిగింది.
అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?
బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది.
నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?
హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.
వ్యోమగాముల తిరిగి రాక ఎలా..
వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సునీత వచ్చేది అప్పుడేనా..
స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్‌మోర్‌ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment