
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ‘క్రూ 10 మిషన్’ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం.. చివరి నిమిషంలో నిలిచిపోయింది.
కిందటి ఏడాది క్రూ9 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన సునీత, విల్మోర్‌లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే క్రూ-10 మిషన్ ద్వారా మరో నలుగురు వ్యోమగాముల్ని అక్కడికి పంపి.. ఆ ఇద్దరినీ వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఈ ఉదయం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39ఏ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ సైతం దగ్గర పడింది.
అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో నలుగురు వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు, లేదంటే ఎల్లుండి.. ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా, అటు స్పేస్‌ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత.. సునీత, విల్మోర్లు భూమ్మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.

ప్రీపోన్ అయినప్పటికీ..
తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా. అయితే ఇవాళ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమస్య తలెత్తి వాయిదా పడింది. క్రూ-10 ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ ద్వారా సునీత, విల్మోర్లు భూమ్మీదకు తిరిగి వస్తారు. అదే సమయంలో ఐఎస్‌ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. ఇక క్రూ10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు వస్తారు.
9 నెలల నిరీక్షణ..
కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లోనే ఉండిపోయారు. వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment