![NASA shares big update on Sunita Williams and Wilmore return](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/sunitaaa.jpg.webp?itok=6bZu3LqJ)
ఇంకా సిద్ధం కాని స్పేస్‌ఎక్స్ ‘డ్రాగన్’స్పేస్‌క్రాఫ్ట్
సునీతా విలియమ్స్, విల్మోర్ ఆగమనం మరింత ఆలస్యమయ్యే అవకాశం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్‌ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు.
ఐఎస్‌ఎస్ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్‌ఎక్స్ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్ వెనక్కి రాలేరు. ఏప్రిల్ నాటికి కూడా డ్రాగన్ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్–4 మిషన్‌లో భాగంగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే భారత గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు.
డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్‌ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్‌ఎస్‌కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్–4 మిషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment