అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన శ్యామలాదేవికి నేడు సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరువైంది! శిక్షకులు, మార్గదర్శకులు లేకుండా.. పట్టుదల, సాధనే కృషిగా అంతర్జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పటికీ ఏ గుర్తింపు లేకుండా ఆమె అనామకంగా ఉండవలసి వస్తోంది! కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడంతో చిరు ఉద్యోగంతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. శ్యామల 2006లో దక్షిణకొరియాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం సాధించి, భారతదేశ జెండాను రెపరెపలాడించారు.
దాంతో పాటు జాతీయ స్థాయిలో 8 రజిత, 16 కాంస్య పతకాలు గెలుపొందారు.శ్యామల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. తండ్రి కిషోర్‌కుమార్. తల్లి విజయలక్ష్మి. తండ్రి అల్యూమినియం వస్తువులు తయారు చేసే పరిశ్రమలో దినసరి కార్మికుడిగా పని చేసేవారు. పెద్ద కుటుంబం, తక్కువ ఆదాయం కావడంతో తండ్రికి అండగా ఉండేందుకు బి.కాం. చదివినప్పటికీ శ్యామల కూడా దినసరి కార్మికురాలిగా వెళ్లేవారు. శ్యామలకు పాఠశాలస్థాయి నుంచే ఆటలపై మక్కువ. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్‌లో ఒడుపు సాధించారు. అలా కళాశాల నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
2005లో పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ లక్షల్లో ఖర్చు కనుక ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్యామలకు ఆ అవకాశం చేజారిపోయింది. ‘శాప్’ అధికారులకు విన్నవించుకుంటే.. ‘ఇంతా ఖర్చు చేశాక పతకం తీసుకురాకుంటే!’ అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి సంవత్సరం దాతలు కొందరు ముందుకు రావడంతో పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియాలో పతకం సాధించారు.
అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో ఆ క్షణం నుంచే ఆటలకు ఆమె స్వస్తి పలికారు. ప్రస్తుతం శ్యామల నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రోత్సహించే వారు కరువవడం, బంగారుపతకం సాధించిన తరువాత ఆమెను మంత్రులు, పెద్ద అధికారులకు పరిచయం చేసే వారు లేకపోవడంతో ఆ ఆణిముత్యం ప్రతిభ అంతటితో అగిపోయింది. పేద కుటుంబంలో జన్మించి దేశం గర్వించే విధంగా పతకం సాధించిన శ్యామలాదేవి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది.
వెయిట్ ‘లిస్ట్’
►2004 ఆగస్టులో... సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం.
►2004 నవంబర్‌లో... సౌత్ ఇండియాచాంపియన్‌షిప్‌లో స్వర్ణం.
►2005 జనవరిలో...జూనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లో 4 కాంస్యాలు.
►2005 ఫిబ్రవరిలో...జూనియర్స్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం.
►2005లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత.అదే ఏడాది...అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో రజతం.
►2006లో...జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్‌లో 4 రజతాలు.
►2006... ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీలలో స్వర్ణం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోపాల్గొనేందుకు అర్హత.
Comments
Please login to add a commentAdd a comment