
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తనలాగే రామ్ చరణ్‌కు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు. మా ఇంట్లో నా చుట్టూ అంతా మనవరాల్లే ఉన్నారని.. ఇళ్లంతా లేడీస్ హాస్టల్‌ను తలపిస్తోందని అన్నారు. చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమనని భయమేస్తోందని సరదాగా అన్నారు. చిరు సరదాగా కామెంట్స్ చేసినప్పటికీ..దీనిపై పలువురు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. వారసుడంటే మగపిల్లాడేనా.. కూతుర్లు వారసురాళ్లు కాకూడదా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
తాజాగా చిరంజీవి చేసిన కామెంట్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించింది. వారసుడు అంటే కొడుకే అవుతాడా?.. కూతురు అవ్వకూడదా? అని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు కానీ..వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అనే ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుంటుందని అన్నారు. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచన సరికాదన్నారు. వారి కోడలు ఉపాసన కూడా ఎంత చక్కగా రాణిస్తున్నారు. కొడుకైనా.. కూతురైనా వారసులు అవ్వొచ్చు అని తెలిపింది శ్యామల.
మెగాస్టార్ ఏమన్నారంటే..
బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంట్లో నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment