బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో విలన్‌గా నటించింది శ్యామల. తర్వాత మైక్ పట్టి యాంకరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. ఇటీవల వచ్చిన విరూపాక్షలోనూ ముఖ్య పాత్ర పోషించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను చాలా త్వరగా ప్రేమలో పడ్డాను. 19 ఏళ్లకే కులాంతర వివాహం చేసుకున్నాను. అమ్మానాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా మామయ్య వాళ్లు ఇంట్లో శుభలేఖ ఇచ్చి పిలిచారు. కానీ ఎవరూ రాలేదు. ఇప్పటికీ ఈ విషయంలో నేను బాధపడుతూనే ఉంటాను. నా పెళ్లి మా అమ్మ చూడలేదు.. అదే నా జీవితంలో మిగిలిపోయిన లోటు. ఆమెను ఎలాగోలా ఒప్పించి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఉండుంటే బాగుండేదనిపిస్తుంది.
పెళ్లయిన రెండేళ్ల తర్వాత మా అమ్మ ఒక రోజు సడన్‌గా ఇంటికి వచ్చింది. తనను చూసి ఒక్కసారిగా నేను షాకయ్యాను. నా భర్త గురించి, ఆయన కుటుంబం గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నా దగ్గరికి వచ్చింది. నాకు కొడుకు పుట్టిన తర్వాత రాకపోకలు మరింత పెరిగాయి. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నరసింహ నా ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోడు. ఇద్దరం మా పని మేము చేసుకుంటాం. నేను ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. బాబు పుట్టాక గ్యాప్ వచ్చింది. ఇషాన్‌కు 11 నెలల వయసున్నప్పుడు బిగ్‌బాస్ 2 ఆఫర్ వచ్చింది. అలా ఆ రియాలిటీ షోకి వెళ్లాను. అప్పుడు నాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇంత చిన్న బాబును వదిలేసి డబ్బు కోసం వెళ్తున్నావా? అని నానామాటలు అన్నారు. కానీ నేనేంటో మా ఫ్యామిలీకి తెలుసు, కాబట్టి ఆ మాటలను నేను పట్టించుకోలేదు.
కోవిడ్ సమయంలో జరిగిన షాకింగ్ సంఘటన.. ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టడం. ఆమె నాకు తెలుసు. మా ఇంటికొస్తే నా చేతితోనే భోజనం వండి పెట్టాను. చివరకు ఆమె నా భర్త మీదే చీటింగ్ కేసు పెట్టింది. తనతో మాట్లాడాలన్నా నాకు మనసు విరిగిపోయింది. నా భర్త మోసం చేసే వ్యక్తి కాదు. అలాంటిది ఇంత పెద్ద ఆరోపణ మోపింది. ఆయన ఏ తప్పూ చేయలేదు. చివరకు అదే రుజువైంది. మన అనుకునేవాళ్లు కూడా వెన్నుపోటు పొడుస్తారని అప్పుడే అర్థమైంది' అని చెప్పుకొచ్చింది శ్యామల.
చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక రియాక్షన్ ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment