బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.
ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్‌లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్‌లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్‌లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్‌ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు.