Tourist destination
-
పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్‌ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను దేశానికే ఆదర్శంగా, అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 15 కిలోమీటర్లు ప్రతిపాదించిన మానేరు రివర్ ఫ్రంట్‌లో తొలి విడతగా 4 కి.మీ మేర నిర్మాణాలు చేపట్టనున్నారు. సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం, ఈ ప్రతిపాదనలపై ఐ అండ్ క్యాడ్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. రోజువారీ పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయి డిజైన్లు రూపొందించాలని, టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, టీఎస్‌టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హరీశ్ గోయల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్.. పాతబస్తీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్‌కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సల్వకాలమే అవి సక్సెస్.. హైదరాబాద్‌లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్ ఇయర్ చాలెంజ్’అంటూ స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు. పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్టీఎస్! హైదరాబాద్‌లో బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు. చేనేతకు పెద్ద ఫ్యాన్.. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్‌లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్ మీడియా లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. ఇంకా వెతుకుతున్నా.. తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ కోరిక మేరకు కేటీఆర్ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు. జగన్ పాలన.. మంచి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..! అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీహబ్–టీవర్క్స్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?
ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి అదొక మంచి ప్రదేశంగా మారడమే. ఇలా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు క్రిష్టినా రోసి తెలిపారు. 1880 కాలంలో ఇక్కడ ప్రజలు నివసించేవారు. వారంతా బంగారం, వెండి తవ్వుకుంటూ జీవనం సాగించేవారు. కానీ 1919 వచ్చేసరికి ఏమైందో ఏమో కానీ జనసంచారం తగ్గి ఎడారిలా మారింది. కారణం అక్కడ ఓ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం జరగడం. దీంతో ఓ శతాబ్దకాలం మూగబోయినట్లున్న ఆ ఏరియా ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది. మొత్తం 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో 200 ఎకరాల్లో దాదాపు 12 లాగ్ క్యాబిన్లను నిర్మించారు. వాటికి పూర్వీకుల పేర్లు, ఆ ప్రాంత చరిత్రను సూచించేలా పేర్లు పెట్టారు. ఒక్కోటి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఇంకా అక్కడికి తరలివస్తున్న పర్యాటకులకు ఫిషింగ్, హార్స్ రైడింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాకపోతే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇక్కడ ఒక్కరికి ఒక్క రాత్రికి 630- 2100 డాలర్లు అవుతుంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ... కొలరెడోలోని డంటన్ హిల్‌స్టేషన్ ప్రాంతం. -
ఐదుగురిని కాపాడిన చెట్టు..!
⇒ ఘాట్‌పై సెల్ఫీ తీసుకుంటున్న వారిని కాపాడబోయి ప్రమాదం ⇒ హార్సిలీహిల్స్ ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులను ఓ చెట్టు ఆధారంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణానికి చెందిన హరీశ్ తన నలుగురు మిత్రులతో కలసి ఇన్నోవా వాహనంలో హార్సిలీహిల్స్ సందర్శనకు వచ్చారు. కొండపై పర్యటన ముగించుకొని వెళ్తుండగా.. 9వ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద కొందరు యువకులు బైక్‌ను రోడ్డుపై నిలబెట్టి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇది గమనించిన డ్రైవర్ రాజేష్ వారిని తప్పించేందుకు సడన్ బ్రేక్‌వేసినప్పటికీ ఇన్నోవా ఆగలేదు. రక్షిత గోడను ఢీకొంటూ లోయవైపు దూసుకెళ్లింది. అయితే వాహనం 10 అడుగుల ముందుకువెళ్లి అక్కడే ఉన్న ఓ చెట్టును ఢీకొనడంతో లోయలో పడకుండా తప్పించుకున్నారు. ముందు చక్రం మొక్కను గట్టిగా అతుక్కుపోవడంతో ఇన్నోవా ముందుకు కదల్లేదు. కాసేపటికి తేరుకున్న డ్రైవర్ మిగతా వారు డోర్లు తీసుకుని బయటపడ్డారు. -
సమస్యల ఆటపాక కేంద్రం
పర్యాటక కేంద్రం అభివృద్ధి శూన్యం చిత్తడిగా మారిన రహదారులు మూలనపడ్డ ఫెడల్బోట్లు రహదారిలో వీధిలైట్లు లేవు ఆటపాక (కైకలూరు) : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆటపాక పక్షుల విహార కేంద్రం సమస్యలతో కునారిల్లుతోంది. ఆస్ట్రేలియా, సైబీరియా వంటి విదేశాల నుంచి అరుదైన పెలికాన్ పక్షులు కొల్లోరు సరస్సుకు తరలివస్తుంటాయి. వాటిని చూసేందుకు సందర్శకులు ఉత్సాహంగా వస్తారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న పక్షుల విహార కేంద్రాల్లో ఆటపాకలో మాత్రమే బోటు షికారు చేస్తూ ఎక్కువ సంఖ్యలో పెలికాన్ పక్షులను తిలకించే అవకాశం ఉంది. పర్యావరణ అధ్యయన కేంద్రం (ఈఈసీ) వద్ద పక్షుల నమూనాలతో ఏర్పాటుచేసిన మ్యూజియం సందర్శకులను ఆకర్షిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి కుటుంబ సభ్యులతో ప్రకృతి ఆస్వాదిద్దామని వచ్చే యాత్రికులు ఇక్కడి అసౌకర్యాలను చూసి అటవీ అధికారులు పనితీరును విమర్శిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కరువు ఆటపాక పక్షుల కేంద్రంలో యాత్రికులకు కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఆట పాక నుంచి ఈఈసీ కేంద్రానికి వెళ్లే మార్గం చిన్నపాటి వర్షంపడినా బురదకయ్యిగా మారుతోంది. వాహనచోదకులు అదుపుతప్పి జారి పడుతున్నారు. పర్యాటకులకు తాగునీటి సౌకర్యం లేదు. పక్షుల కేంద్రం టికెట్టు కౌంటర్ వద్ద ఏర్పాటుచేసిన ట్యాంకులో నీరు తాగేం దుకు వీలుగాలేదని సందర్శకులు పేర్కొంటున్నారు. ఈఈసీ కేంద్రం వద్ద కూడా తాగునీటి వసతి లేదు. పక్షుల కేంద్రం రహదారి వెంబడి ఒక్కటంటే ఒక్క వీధిలైటు లేదు. దీంతో సాయింత్రం వచ్చే యాత్రికులు చికటిపడితే భయపడుతున్నారు. ఇటీవల చికట్లో వెళ్తున్న ముగ్గురు యాత్రికులు ఓ పామును తొక్కారు. అది కాటువేయకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. యాత్రికులకు కొల్లేరు సరస్సు విశిష్టత, ఆశ్రయం పొందే పక్షుల విరాలు తెలిపేందుకు ఒక్క గైడూ లేడు. పర్యాటక కేంద్రం ప్రవేశానికి రూ.10, బోటు షికారుకు రూ.200 వసూలు చేస్తున్న అటవీ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. మూలన పడిన ఫెడల్ బోట్లు యాత్రికులను ఆకర్షించడానికి పట్టణాలకే పరిమితమైన ఫెడల్బోటు షికారును అటవీ అధికారులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం రెండు బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. అయితే వాటికి మరమ్మతులు చేయించడంలేదు. ఆరు నెలల క్రితం ఈదురుగాలులకు ఈఈసీ కేంద్రం పైకప్పు రే కులు ఎగిరి సమీప చేపల చెరువుల వద్ద పడ్డాయి. ఆ రేకులను ఇప్పటి వరకూ తొలగించలేదు. మరోపక్క పక్షుల విహార చెరువు గట్లు కోతకు గురవుతున్నా సరిచేయడంలేదు. అటవీ అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించడంతోపాటు, సమస్యలను పరిష్కరించాలని సందర్శకులు కోరుతున్నారు. అంచనాలు రూపొందించాం ఆటపాక పక్షుల విహార కేంద్రం రోడ్డు మరమ్మతులకు అంచనాలు రుపొందించామని అటవీశాక రేంజర్ సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ కేంద్రం వద్ద పెలికాన్ పక్షుల అవాసాల కోసం కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. -
పర్యాటక కేంద్రంగా ‘రఘునాథ చెరువు’
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి అదనపు సంయుక్త కార్యదర్శి స్మిత సబర్వాల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ముందుగా ఖిల్లా ప్రాంతంలోని రఘునాథ చెరువు, ఖిల్లా రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. ఈ ప్రాంతం తెలంగాణలో తలమానికమన్నారు. ఇక్కడ తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు స్వయంగా తానే ఖిల్లా రామాలయ గోడలపై ‘నా తెలంగాణ.. కోటి రతనా ల వీణ’ అని రాసి యావత్తు తెలంగాణ ప్రజలను జైలు నుంచే ఉత్తేజపరిచారన్నారు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భక్తుడు భక్తరామదాసు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే సేద తీరిన ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హమల్‌వాడి నుంచి దుబ్బ రోడ్డును పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి గౌతంనగర్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందోలేదనని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుభాష్‌నగర్ రైతుబజార్‌ను పరిశీలించి ఇంకా పెద్ద ఎత్తున కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్తో పాటు నగరమేయర్ సుజాత శ్రీశైలం,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు తదితరులున్నారు. -
పేదవారి ఊటీ... కొల్లి మలై
వేసవి కాలం కుటుంబంతో కలసి సెలవులు హాయిగా, చల్లగా ఆస్వాదించాలనగానే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్, కులూ మనాలి లాంటివి గుర్తొస్తాయి. దక్షిణాదిలోనే చూద్దామనుకుంటే ఊటీ, కొడెకైనాల్ లాంటి వాటికి తప్ప వేరే సరికొత్త హిల్ స్టేషన్లు మనసులోకి రావు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - ‘కొల్లి మలై’గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పర్యాటకుల తాకిడికి ఇంకా పెద్దగా లోనుకాని ప్రాంతమిది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం కేవలం 1500 మీటర్ల ఎత్తున ఉంటుంది. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు ఇది నిలయం. ప్రాథమికంగా ఈ కొల్లి హిల్స్‌లో ‘మలయాళీ గిరిజనులు’గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. పట్టణ ప్రాంతపు నవ నాగరికులు ఎవరూ ఉండరు. అందుకే, ఈ కొల్లి హిల్స్‌కు కేంద్రస్థానమైన సెమ్మేడులో కూడా మనకు అపరిశుభ్రమైన రహదారులు కానీ, బహిరంగంగా ప్రవహించే మురుగు నీరు కానీ కనిపించవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులు కూడా ఎంతో సంస్కారయుతంగా ఉంటారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు. ఆ కొండ కోనల అభివృద్ధిలో చదువు కీలక పాత్ర పోషించిందని అనుకోవచ్చు. ఒక్కసారి గతంలోకి వెళితే, కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తావన ప్రాచీన తమిళ రచనలైన ‘శిలప్పదికారం’, ‘మణిమేఖలై’, ‘పురననూరు’, ‘ఐన్కుర్నూరు’ లాంటి వాటిలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని వసతులూ ఉండేవనీ, అందరికీ ప్రాథమిక విద్య ఉండేదనీ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇవాళ్టికీ కొనసాగుతోంది. ఈ కొండల్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా కొత్త పనులు చేపడుతుంటారు. ఇక, ఈ కొల్లి హిల్స్‌కు ఒకప్పటి పాలకుడైన వాళ్విల్ ఒరి ఎంతో ముందుచూపున్న మనిషి అని ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావన ఉంది. దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఈ కొండ ప్రాంతం, ఇక్కడి ప్రజలపై ఆయన ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది... చలి పెట్టదు! మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి భిన్నంగా కొల్లి హిల్స్ ప్రశాంతంగా ఎండాకాలంలో కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అనువుగా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. అందుకే, వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. పైగా, ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని ‘పేదవాళ్ళ ఊటీ’ అని పిలుస్తుంటారు. చుట్టుపక్కల చూడదగ్గవెన్నో! నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేసే ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా, సాహసోపేతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం కేవలం 15 కి.మీ.లే. కానీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 73 మలుపులతో ఉంటుందా మార్గం. పగటి పూట ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కొండల సౌందర్యాన్ని కళ్ళారా చూడవచ్చు. కెమేరాతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కొల్లి హిల్స్ పైకి చేరాక, అక్కడ ఉన్నంతలో పెద్ద పట్నం - సెమ్మేడు. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాలకు తిరిగి రావచ్చు. సెమ్మేడులోనే హోటళ్ళు, రిసార్టులు ఉంటాయి. సెమ్మేడుకు 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఋతుపవనాలు వచ్చి, తొలకరి జల్లులు కురిశాక, ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! ఇక్కడకు దగ్గరలోనే ప్రాచీన సంగ కాలానికి చెందిన ఆరపాలీశ్వర ఆలయం ఉంది. ఈ శివుడి గుడి ఎంతో మహిమాన్వితమైనదని స్థానికుల నమ్మకం. ఈ ‘పేదవారి ఊటీ’ని అభివృద్ధి చేయవచ్చని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గడచిన ఏడేళ్ళుగా ఆ పనిలో ఉంది. పర్యాటక స్థలంగా కొల్లి హిల్స్‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే, ఈ కొండల మీద ఓ రెండు వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని చూస్తోంది. అవే గనక సిద్ధమైతే, పర్యాటకులకు మరింత ఆకర్షణ తోడవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ వరం. ఇక్కడ సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సహజంగా పండించి, అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి తోటలు పుష్కలం. మిరియాలు, కాఫీ లాంటి వాణిజ్య పంటలు ఈ కొండల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దిగుబడి. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు గుర్తుగా ఇలాంటివి కొని తీసుకువెళ్ళచ్చు. గిరిజనుల పవిత్ర అరణ్యాలు మరో విశేషం ఏమిటంటే, ఈ కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్’లో పనిచేస్తున్న డాక్టర్ ఇజ్రాయెల్ ఆలివర్ కింగ్ ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే ఈ అడవులపై పిహెచ్.డి. చేశారు. ‘‘పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఎవరినీ గిరిజనులు అనుమతించరు. ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు. ఈ కొండలకే పరిమితమైన ఈ విలక్షణ ఆచారం, పవిత్ర అరణ్యాలనే ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు’’ అని కింగ్ వివరించారు. కొల్లి హిల్స్‌లోని ఈ మలయాళీ గిరిజనులు నేరాలకు పాల్పడరు. అందుకే, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినట్లు పెద్దగా ఎప్పుడూ వినం. అయితే, ఇక్కడ జరిగే ఒకే ఒక్క నేరం - వ్యభిచారం. గమ్మత్తేమిటంటే, అలా వ్యభిచరిస్తూ పట్టుబడిన జంట పంది మాంసం వండి, మొత్తం గ్రామ ప్రజలకు విందు పెట్టడమే శిక్ష! ఎలా వెళ్ళాలంటే... తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేలమ్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. చక్కటి రైలు మార్గం కూడా ఉంది. మరింకేం! ఈ ‘పేదవారి ఊటీ’కి వెళ్ళి, ప్రకృతిలో తాదాత్మ్యం కండి! * తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. * కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. * పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి * ఎవరినీ ఇక్కడి గిరిజనులు అనుమతించరు. - కె. జయదేవ్ (ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, చలనచిత్ర రూపకర్త. సైన్స్ పత్రిక ‘నానో డెజైస్ట్’కు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.) -
‘దుర్గం’పైసుందర మార్గం
రూ. 250 కోట్లతో వేలాడే వంతెన సందర్శకులను ఆకట్టుకునేలా ‘హౌరా’ తరహాలో ఏర్పాటు జూబ్లీహిల్స్- హైటెక్‌సిటీ రోడ్డులో తప్పనున్న ‘జాం’జాటం సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు .. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్‌ల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ జాంజాటాన్ని తప్పిస్తూనే, మరోవైపు.. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకునేలా ఓ అందమైన వంతెన నగరంలో అందుబాటులోకి రానుంది. ఎలాంటి స్తంభాల ఆధారం లేకుండా ఏర్పాటు కానున్న ఈ వేలాడే వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి)ను దుర్గం చెరువుపై నిర్మించనున్నారు. హౌరా- కోల్‌కతాల మధ్య ఉన్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించే ఈ వంతెనను జీహెచ్ఎంసీ, ఏపీఐఐసీ, పర్యాటకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) బాధ్యతను ఏపీఐఐసీ.. ‘రైల్ ఇండియా టెక్నో, ఎకనామిక్, సర్వీసెస్(రైట్స్)’కు అప్పగించింది. అది ట్రాఫిక్, పర్యావరణం, చెరువుపై నిర్మాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయి సర్వేతో డీపీఆర్‌ను పూర్తిచేసింది. నిర్మాణవ్యయాన్ని రూ. 250 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో సాంకేతిక, స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏపీఐఐసీ టూరిజం, జీహెచ్ఎంసీల అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు త్వరలో సమావేశమై బ్రిడ్జి పనులకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత వ్యయాన్ని భరించాలనే అంశాలను సైతం త్వరలో జరగబోయే సమావేశాల్లో నిర్ణయించనున్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు ఈ వంతెనను నిర్మించనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆరు లేన్లతో నిర్మించే ఈ వంతెన పొడవు 350 మీటర్లు. దీని ట్రాఫిక్ సామర్ధ్యం 7000 పీసీయూ (పర్ అవర్ కార్ యూనిట్). అంటే గంట సమయంలో ప్రయాణించే వాహనాలు. హౌరా బ్రిడ్జి సామర్ధ్యం రోజుకు దాదాపు లక్ష వాహనాలు. ఈ బ్రిడ్జి వాడుకలోకి వస్తే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36పై వాహన భారం తగ్గుతుంది. -
మూన్నాళ్ల ముచ్చట
మొల్ల పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రెస్టారెంట్ పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నష్టాలలో నడుస్తోంది. ఇక్కడ 5 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ప్రతినెల రూ. 35 వేలను జీతాలుగా చెల్లిస్తున్నారు. ఇతర ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. జీతాలకు సరిపడ ఆదాయం కూడా రావడం లేదు. దీంతో మార్చిలోపు హరిత రెస్టారెంట్ మూతపడనుంది. -న్యూస్‌లైన్, గోపవరం -
లక్ష బోగస్ రేషన్‌కార్డులున్నాయ్
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా లక్ష బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించామని జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన బి.కొత్తకోటలోని పౌరసరఫరాల స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో విడత రచ్చబండలో జిల్లాలో 45వేల రేషన్‌కార్డులను పంపిణీచేసామని, వీటిని కలుపుకుంటే మొత్తం 10,37,490 తెల్ల కార్డులున్నాయన్నారు. వీటన్నింటికీ అమ్మహస్తం సంచులు వచ్చాయని,అందులో లక్షమంది సంచులను తీసుకోలేదన్నారు. దీన్నిబట్టి లక్ష రేషన్‌కార్డులు బోగస్‌గా భావిస్తున్నామన్నారు. 28లక్షల రేషన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేశామని, మిగిలిన కార్డులకు ఆధార్సంఖ్య రాకుంటే వాటిని కూడా బోగస్కార్డులుగానే గుర్తిస్తామన్నారు. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో సాహసక్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం కేటాయించనున్న మూడెకరాల భూమి విలువ రూ. 3కోట్లుగా నిర్ణయించనున్నామని చెప్పారు. దీన్నే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పామాయిల్‌పై రాయితీని కేంద్రం ఉపసంహరించుకోవడంతో 975 మెట్రిక్‌టన్నుల పామాయిల్ జిల్లాకు రాలేదన్నారు. చౌక బియ్యం కర్ణాటకకు తరలిపోయి అక్కడ పాలిష్‌చేసిన బియ్యాన్నే రూ. 40కు విక్రయిస్తున్న విషయమై స్పందిస్తూ బి.కొత్తకోటలో కిలో రూ. 30కు సోనా మసూరి బియ్యం విక్రయించే కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట పౌరసరఫరాల డీఎం సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్ వెంకటరమణారెడ్డి ఏఆర్ఐ శ్రీనివాసులురెడ్డి, సీఎస్‌డీటీ హరిప్రసాద్, గోదాము డీటీ భానుమూర్తి ఉన్నారు.